కులభూషణ్ జాదవ్ మరణశిక్ష నిలిపివేత

కులభూషణ్ జాదవ్ మరణశిక్ష నిలిపివేత

కులభూషణ్ జాదవ్ కేసులో భారత్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది.. పాకిస్థాన్ ఆర్మీ జైళ్లో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారిపై పాకిస్తాన్ మిలిటరీ కోర్టు విధించిన మరణ శిక్షపై స్టే విధించింది అంతర్జాతీయ న్యాయస్థానం. కేసును మళ్లీ సమీక్షించాలని పాకిస్తాన్ ను ఆదేశించింది. అప్పటివరకు మరణశిక్ష అమలును నిలిపివేయాలని ఐసీజే తీర్పు ఇచ్చింది. 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారత్ కు అనుకూలంగా తీర్పు  ఇచ్చారు. భారత్ కు న్యాయవాదిని నియమించుకునే హక్కు ఉందని కోర్టు స్పష్టం చేసింది. భారత రాయబార అధికారులు జాదవ్ ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.

గూఢచర్యం  ఆరోపణలపై  2016 మార్చి 3న  కులభూషణ్ జాదవ్ ను  అరెస్ట్ చేసింది పాక్ ఆర్మీ.  అక్రమంగా  పాక్ లోకి  ప్రవేశించేందుకు  ప్రయత్నించారని,  ఉగ్రవాద కార్యకలాపాలను  ప్రోత్సహించారని   కేసు పెట్టింది.  కుల్ భూషన్  కు .. 2017 ఏప్రిల్ లో  పాకిస్తాన్  మిలటరీ  కోర్టు ఆయనకు  మరణశిక్ష  విధించింది. దీనిపై భారత్ అంతర్జాతీయ  న్యాయస్థానాన్ని  ఆశ్రయించింది.  ఇరాన్ లో  వ్యాపారం చేసే  మాజీ నౌకాదళ  అధికారిని  పాకిస్తాన్  ఉద్దేశపూర్వకంగా  అరెస్ట్ చేసిందని  ఫిర్యాదు చేసింది. గత ఫిబ్రవరిలో ICJ లో నాలుగు రోజుల పాటు ఇరు దేశాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. భారత్ తరుపున  సీనియర్ న్యాయవాది  హరీశ్ సాల్వే  వాదనలు వినిపించారు. దీంతో తీర్పు  ఇచ్చే వరకు  శిక్ష అమలు  ఆపేయాలని పాకిస్థాన్ ను ఆదేశించింది.  ఇవాళ తుది తీర్పు వెల్లడించింది అంతర్జాతీయ న్యాయస్థానం