వరద బాధితులకు కరువైన సర్కారు సాయం

వరద బాధితులకు కరువైన సర్కారు సాయం
  • వరద బాధితులకు సాయం   ఊసేలేదు
  • లక్షల్లో ఆస్తి నష్టం బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలు, ఎన్​జీవోల చేయూత 

మంచిర్యాల, వెలుగు: జిల్లాలోని వరద బాధితులకు సర్కారు సాయం కరువైంది. వరదల్లో ఇండ్లు, పంటలు మునిగిపోయి లక్షల్లో నష్టం జరిగింది. చాలామంది పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, అధికారులు వస్తారని, సాయం చేస్తారని ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగులుతోంది. ఓవైపు బీజేపీ, కాంగ్రెస్​తో పాటు పలు పార్టీల నాయకులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. భోజనాలు పెడుతున్నారు. నిత్యాసర సరకులు, దుప్పట్లు, మహిళలకు చీరెలు, తోచినవిధంగా ఆర్థికసాయం అందిస్తున్నారు. 

ఆదుకోని అధికార పార్టీ

వరద బాధితుల దగ్గరికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారు. కానీ, సాయమూ అందించడం లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్​రావు, బాల్క సుమన్​, దుర్గం చిన్నయ్య వారి నియోజకవర్గాల్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేయాలని, కరెంట్​ సప్లై పునరుద్ధించాలని, తాగునీరు అందించాలని అధికారులను ఆదేశిస్తున్నారే తప్పా.. బాధితులకు భరోసా ఇస్తున్నట్టు కనిపించడం లేదు. ‘ప్రభుత్వం అండగా ఉంటుంది, మేము ఆదుకుంటాం, అధైర్యపడకండి' అన్న మాటలు నీటి మూటలుగానే మిగులుతున్నాయి. తప్ప తక్షణ ఆర్థికసాయం గురించి, నష్టపరిహారం గురించి స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ప్రభుత్వం వరద నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని డిమాండ్​ చేస్తున్నారు. 

ప్రతిపక్షాలు, ఎన్​జీవోల సాయం

జిల్లాలోని వరద బాధిత కుటుంబాలకు బీజేపీ, కాంగ్రెస్​, సీపీఐతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి శనివారం కోటపల్లి మండలంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. దేవులవాడ, అన్నారంలో బాధిత కుటుంబాలకు కాకా వెంకటస్వామి ఫౌండేషన్​ ద్వారా నిత్యావసర సరుకులు అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు మంచిర్యాల, వేంపల్లిలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో ముంపు బాధితుల ఆకలి తీర్చడంతో పాటు వందల మందికి నిత్యావసర సరుకులు అందించి అండగా నిలిచారు. ఇండియన్​ రెడ్​క్రాస్​ సొసైటీ, మంచిర్యాల వాసవీ క్లబ్స్​, మంచిర్యాల పట్టణ వస్ర్తవ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో సరుకులు అందించడమే కాకుండా ఎన్టీఆర్​ నగర్​లో మహిళలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఇంకా పలు సంస్థలు బాధితులకు తమ వంతు సహాయం అందించి మేమున్నామనే భరోసా ఇస్తున్నాయి. 

లక్షల్లో నష్టం..

వర్షాలు, వరదలకు జిల్లాలో వందల ఇండ్లు కూలిపోయాయి. మంచిర్యాల జిల్లా కేంద్రం రాంనగర్, ఎన్టీఆర్ నగర్, ఆదిత్య ఎన్​క్లేవ్​ తదితర కాలనీలు నీటమునిగాయి. ఇండ్లలోని నిత్యావసర వస్తువులతో పాటు విలువైన సామాన్లు పాడైపోయాయి. కిరాణా షాపులు, బ్యూటీపార్లర్లు, కంగన్ హాళ్లు, ఇతర షాపుల్లోని సామాన్లు కొట్టుకుపోయాయి. ఒక్కో కుటుంబానికి కనీసం రూ.లక్ష నుంచి రూ.10 లక్షలకు పైగా నష్టం జరిగింది. కానీ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ఆర్థిక సహాయం ప్రకటించలేదు. జీవో 2 ప్రకారం పక్కా ఇండ్లు 15 శాతానికి పైగా దెబ్బతింటే రూ.5,200, కచ్చా ఇండ్లకు రూ.3,200 అందించి చేతులు దులుపుకుంది. 

పంట పరిహారం ముచ్చటే లేదు..

జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతంలో 34వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 750 ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. పొలాల్లోని కరెంటు పోళ్లు, మోటార్లు, షెడ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. అత్యధికంగా పత్తి పంట దెబ్బతినడంతో రైతులకు ఎకరానికి రూ.30వేల దాక నష్టం జరిగింది. కాళేశ్వరం బ్యారేజీల బ్యాక్ వాటర్ జైపూర్​, చెన్నూర్​, కోటపల్లి మండలాల్లో గత మూడేండ్లుగా పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇది నాలుగోసారి. కానీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల నుంచి పంటలకు నష్టపరిహారం ఇవ్వడం లేదు. 2019 నుంచి ఇన్పుట్ సబ్సిడీని కూడా రద్దు చేసింది. పరిహారం రాకపోవడంతో నిరుడు ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యేలను రైతులు పరిహారం గురించి అడిగితే పట్టించుకోకుండానే వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

నీళ్లొచ్చి మా ఇండ్లన్నీ మునిగినయి. కట్టుబట్టలతోటి బయటకొచ్చినం. ఇండ్లళ్ల సామాన్లన్నీ కొట్టుకపోయినయి. మొన్న ఎంపీ వెంకటేశ్​​ నేత, ఎమ్మెల్యే దివాకర్​రావు వచ్చిన్రు. ‘నీళ్లు ఇంట్లకు వచ్చినయా’ అని అడిగిన్రు. సార్లు వచ్చి రాసుకుంటరని చెప్పుకుంట పోయిన్రు. మాకు కరెంట్​ లేదు. నీళ్లు లేవు. దూరం నుంచి నీళ్లు తెచ్చుకొని ఇండ్లు కడుక్కుంటున్నం. ఒక్క నీళ్ల ట్యాంకర్​ కూడా పంపలేదు. రూపాయి సాయం చేయలే. ఐదు కిలోల బియ్యం ఇచ్చిన్రు. అయి ఎన్ని రోజులు తినాలె.

- మంచిర్యాలలోని ఎన్టీఆర్​ నగర్​ మహిళల ఆవేదన

జనరేటర్లు, ట్యాంకర్లు తెచ్చుకుంటున్నరు 

రాంనగర్​లో వందల ఇండ్లు పూర్తిగా మునిగిపోయాయి. ఇండ్లలో చెత్తాచెదారం, బురద పేరుకుపోయింది. క్లీన్​ చేసుకుందామంటే కరెంట్​ లేదు. నీళ్లు లేవు. మున్సిపల్​ ట్యాంకర్లు కూడా పంపడం లేదు. దీంతో కొంతమంది రోజుకు రూ.2వేలు చెల్లించి జనరేటర్లు రెంట్​కు తెచ్చి మోర్లకు కనెక్షన్​ ఇచ్చుకున్నరు. డీజిల్​కు మరో వెయ్యి అదనం. మరికొందరు రూ.500 చెల్లించి ప్రైవేట్​ ట్యాంకర్లతో వాటర్​ తెప్పించుకుంటున్నరు.