లోపించిన పారిశుద్ధ్యం.. చాలాచోట్ల క్వాలిటీ లేని ఫుడ్

లోపించిన పారిశుద్ధ్యం.. చాలాచోట్ల క్వాలిటీ లేని ఫుడ్
  • పెరుగుతున్న కరోనా కేసులు.. ఇంటిబాట పడుతున్న పిల్లలు
  • అంతంతమాత్రంగానే తనిఖీలు

మహబూబాబాద్, వెలుగు: గురుకులాలు, సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు, ఇతరత్రా ప్రభుత్వ హాస్టళ్లలో ఉచిత విద్యతో పాటు క్వాలిటీ ఫుడ్ అందుతుందని చాలామంది పేరెంట్స్ తమ పిల్లలను హాస్టళ్లలో చేర్పిస్తున్నారు. ఏటా జరిగే అడ్మిషన్లకు స్టూడెంట్ల నుంచి వేలాది అప్లికేషన్లు  వస్తున్నాయి. కానీ ప్రభుత్వం పట్టింపులేనితనం, ఆఫీసర్ల నిర్లక్ష్యంతో హాస్టల్ పిల్లలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చాలా హాస్టల్స్ లో శానిటేషన్ పడకేయగా.. సౌలతులు కల్పించడమే మరిచారు. మరోవైపు కరోనా కేసులు సైతం విజృంభిస్తున్నాయి. దీంతో పిల్లలు ఇంటి బాట పడుతుండగా.. పేరెంట్స్ లో ఆందోళన నెలకొంది.

తనిఖీలు అంతంతమాత్రమే..

హాస్టల్ పిల్లలకు సన్న బియ్యంతో పాటు పౌష్టికాహారం అందేలా మెనూ ప్రకారం భోజనం పెడుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ముక్కిపోయిన, పురుగుల పట్టిన బియ్యంతో అన్నం వడ్డిస్తున్నారు. కరాబ్ అయిన కూరగాయలు, సాంబార్​లో బొద్దింకలు వస్తున్నాయి. ఆఫీసర్ల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా భోజనం వడ్డిస్తున్నారు. కొందరు స్టూడెంట్లు కంప్లయింట్లు ఇస్తుండగా.. మరికొందరు భయంతో ఏం చెప్పలేకపోతున్నారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 36 మంది అస్వస్థతకు గురయ్యారు. గూడూరు ఎస్టీ బాలుర వసతి గృహంలో ఏడుగురు, కమలాపూర్ మహత్మా జ్యోతిబాపూలే బాలికల స్కూల్​లో  ఎనిమిది మంది కూడా ఫుడ్ పాయిజన్​ తో ఆసుపత్రి పాలయ్యారు.

పెరుగుతున్న కరోనా కేసులు..

హాస్టల్స్​లో కరోనా కేసులు పెరగడం విద్యార్థులతో పాటు తల్లిదండ్రులనూ కలవరపెడుతోంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలకేంద్రంలోని గాంధీ నగర్ బాలికల గురుకులంలో 25 కేసులు నమోదు కాగా.. తొర్రూరు కేజీబీవీలో 8 మందికి పాజిటివ్ వచ్చింది. వీరందరికీ సెపరేట్ రూమ్స్ కేటాయించినప్పటికీ.. కామన్ బాత్ రూంలు లేక మిగిలిన వారికీ కొవిడ్ సోకుతోంది. ఆఫీసర్లు స్పందించి, కేసులు కట్టడి చేయాలని అటు పేరెంట్స్, ఇటు పిల్లలు కోరుతున్నారు.

పడకేసిన శానిటేషన్..

హాస్టల్స్​లో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. స్కూల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. కిచెన్ షెడ్లు ఈగలు, దోమలతో కనిపిస్తున్నాయి. టాయిలెట్లు అధ్వానంగా ఉన్నాయి. డోర్లకు, కిటికీలకు మెష్ లు లేకపోవడంతో దోమలు లోనికి వస్తున్నాయి. సిబ్బంది కొరత కూడా శానిటేషన్ సమస్యలకు కారణమవుతోంది. ఉన్నతాధికారులు స్పందించి, హాస్టల్స్​లో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. 

స్టూడెంట్లు ఆందోళన చెందవద్దు..

కొత్తగూడ, వెలుగు: కరోనా సోకిన స్టూడెంట్లు ఆందోళన చెందవద్దని డీఎంహెచ్ వో హరీశ్​రాజ్ సూచించారు. సోమవారం ఆయన కొత్తగూడలోని గాంధీ నగర్ బాలికల గురుకులాన్ని పరిశీలించారు. కరోనా సోకిన విద్యార్థులతో మాట్లాడారు. హాస్టల్​ పిల్లలకు ఐసోలేషన్ సౌకర్యాలతో పాటు మెడిసిన్ కూడా ఉచితంగా అందజేస్తామన్నారు. స్టూడెంట్లు జాగ్రత్తలు పాటిస్తే వారం రోజుల్లో కరోనా తగ్గిపోతుందన్నారు.

పిల్లల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటం

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: పేద పిల్లల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆప్ తెలంగాణ రాష్ట్ర సెర్చ్ కమిటీ చైర్ పర్సన్ ఇందిరా శోభన్ విమర్శించారు. సోమవారం మహబూబాబాద్ కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. హాస్టల్స్​లో స్టూడెంట్లకు కల్తీ ఆహారం పెట్టిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు సరైన ఆహారం అందించలేని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తక్షణమే రాజీనామా చేయాలన్నారు. హాస్టల్స్​లో నెలకొన్న సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించాలని డిమాండ్ చేశారు.