డ్రగ్స్ కు బానిసైన లేడీ డాక్టర్..వాట్సాప్ లో ముంబై వ్యక్తికి కొకైన్ ఆర్డర్

డ్రగ్స్ కు బానిసైన లేడీ డాక్టర్..వాట్సాప్ లో ముంబై వ్యక్తికి కొకైన్ ఆర్డర్
  • హైదరాబాద్ రాయదుర్గంలో  అందజేస్తుండగా అరెస్ట్

శేరిలింగంపల్లి, వెలుగు: ప్రజలకు ఆరోగ్య జాగ్రత్తలు చెప్పాల్సింది పోయి ఓ లేడీ డాక్టర్ డ్రగ్స్ కు బానిసగా మారింది.  ముంబైలో ఉండే డ్రగ్స్ పెడ్లర్ వాట్సాప్ ద్వారా ఆర్డర్ పెట్టి, హైదరాబాద్ కు నిషేధిత కొకైన్ డ్రగ్స్ తెప్పించుకుంటోంది. షేక్ పేటలోని  ఏపీఏహెచ్ సీ కాలనీకి చెందిన డాక్టర్ చిగురుపాటి నమ్రత (34) సిటీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో డాక్టర్ గా  చేస్తోంది. 

కొన్నేండ్లుగా ఆమె డ్రగ్స్ కు బానిసగా మారినట్లు పోలీసులు తెలిపారు. ముంబైలో నివాసం ఉండే వాన్స్ టక్కర్ ను వాట్సాప్ ద్వారా సంప్రదించి, రూ. 5 లక్షల కొకైన్ డ్రగ్స్ ఆర్డర్ చేసింది. డబ్బును మొత్తం ఆన్ లైన్ ద్వారా పంపించింది. దీంతో టక్కర్ తన వద్ద డెలివరీ బాయ్ గా పనిచేసే బాలకృష్ణ రాంప్యార్ రామ్(38)కు డ్రగ్స్ ఇచ్చి నగరానికి పంపించాడు. రాయదుర్గంలో నమ్రతను కలిసిన రాంప్యార్ రామ్ డ్రగ్స్ ను అందజేస్తుండగా, పక్కా సమాచారంతో రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.  నిందితుల నుంచి 53 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.