ఏళ్ల తరబడి కష్టపడి పనిచేశాడు. కోట్ల రూపాయల ఆదాయం సంపాదించాడు. ప్రభుత్వానికి దాదాపు రూ. కోటి ఆదాయపు పన్ను కూడా చెల్లించాడు. కానీ ఒక్కసారిగా ఉద్యోగం పోయిన తర్వాత మాత్రం తనకు ఎలాంటి ప్రభుత్వ సహాయం లేదంటూ ఓ భారతీయ ప్రొఫెషనల్ చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఉద్యోగం కోల్పోయిన వారికి సామాజిక భద్రత ఉండాలా? టాక్స్ చెల్లించే వారికి ప్రభుత్వం ఏమివ్వాలి? అనే ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.
మొహమ్మద్ నౌసత్ అనే ఐటీ ప్రొఫెషనల్ ఎక్స్ పోస్టు వైరల్‌గా మారింది. "14 ఏళ్ల కెరీర్‌లో దాదాపు రూ. కోటి ఆదాయపు పన్ను చెల్లించాను. ఇప్పుడు ఉద్యోగం కోల్పోయాను. కానీ నాకు ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ కనిపించడం లేదు. థ్యాంక్యూ ఇండియా" అంటూ ఆయన చేసిన పోస్ట్‌కు వేలాది మంది నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. తనకు కంపెనీ ఇచ్చే సెవరెన్స్ పేపై కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలుసుకున్న తర్వాత మరో పోస్టు చేస్తూ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. దీంతో నిరుద్యోగ భృతి, పన్నులు, ప్రభుత్వ బాధ్యతలపై డిస్కషన్ హీటెక్కింది.
14 years of career, paid close to 1 cr as income tax so far. Now, being laid off.
— Mohamed Nowsath (@Md_Nowsath_) July 18, 2026
Absolutely no trace of any support system. Thank you India 🙏🤐
ఈ పోస్టుపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు నౌసత్‌కు మద్దతు పలుకుతూ, పన్నులు క్రమం తప్పకుండా చెల్లించే వారికి ఉద్యోగం కోల్పోయిన సమయంలో కనీసం 3 నుంచి 6 నెలల పాటు ఆర్థిక సాయం అందించే విధానం భారత్‌లో ఉండాలని అభిప్రాయపడ్డారు. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో నిరుద్యోగులకు ప్రభుత్వ సహాయం లభిస్తుందని గుర్తు చేశారు. అయితే మరికొందరు మాత్రం అత్యవసర పరిస్థితుల కోసం ప్రతి వ్యక్తి ముందుగానే పొదుపు చేసుకోవాలని, ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం లేదని వాదించారు. ఉద్యోగం కోల్పోయినప్పుడు ఆదుకోవడానికి EPF, NPS, 80C వంటి పథకాలు ఇప్పటికే ఉన్నాయని కామెంట్స్ పెట్టారు.
We justify our taxes by comparing with other countries.
— Manoj Arora (@manoj_216) July 19, 2026
But forget to compare the returns that the taxpayers get in those countries.
UK provides monthly financial support + housing support while unemployed.
France provides unemployment benefits that replace a significant… https://t.co/JfcrLVmUCe
విమర్శలకు స్పందించిన నౌసత్ మరోసారి తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా తనకు అభ్యంతరం లేదని, కానీ తాము చెల్లించే పన్నులకు తగిన స్థాయిలో నాణ్యమైన ప్రభుత్వ సేవలు, మౌలిక వసతులు అందాలని అన్నారు. పిల్లలను సురక్షితంగా రోడ్లపై తీసుకెళ్లే ఫుట్‌పాత్‌లు, కాలుష్యం తక్కువగా ఉండే నగరాలు, సైకిల్ తొక్కేందుకు సేఫ్ రూట్స్, ఫ్యామిలీతో గడిపేందుకు పచ్చని పార్కులు, వేగవంతమైన రైలు సౌకర్యాలు వంటి ప్రజా వసతులు అందుబాటులో ఉండాలని ప్రశ్నించాడు.
