జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒకప్పుడు వంద ఫీట్ల వెడల్పుతో ఉన్న వాగులు, నాలాలు ఇప్పుడు కబ్జాలకు గురై కుచించుకుపోతున్నాయి. సహజసిద్ధంగా నీరు పారే మార్గాల్లో మట్టి, మోరం పోసి చదును చేస్తుండటంతో ప్రతి వర్షాకాలం వరద నీరు వెళ్లే దారి లేక శివారు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. మరోవైపు భూముల ధరలకు రెక్కలు రావడంతో చెరువుల శిఖం భూములు, ఎఫ్టీఎల్ పరిధుల్లో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి.
జగిత్యాల పట్టణానికి ఆనుకుని ఉన్న మోతె, అంతర్గాం, చింతకుంట, కండ్లపల్లి, గోవిందపల్లె చెరువులు కలిపి ఒకప్పుడు ‘ఫైవ్ పాండ్స్ ఆఫ్ సిటీ’గా పేరొందాయి. అంతర్గాం నుంచి ధరూర్, నర్సింగాపూర్ మీదుగా కెనాల్స్ ద్వారా మోతె చెరువుకు నీరు చేరుతుంది. అక్కడి నుంచి ముప్పారపు చెరువుకు ప్రవహిస్తుంది. కాగా ధరూర్, నర్సింగాపూర్, గోవిందపల్లె పరిసరాల్లో భూముల విలువలు పెరగడంతో రియల్టర్లు కెనాల్స్, నాలాలను కబ్జా చేశారు. దీంతో 80 ఫీట్ల వెడల్పుతో ఉన్న కాల్వలు ప్రస్తుతం 20 నుంచి 30 ఫీట్లకు కుచించుకుపోయాయి.
భారీ వర్షాలు కురిసి ధరూర్-మోతె వాగు ఉప్పొంగితే వెంకటాద్రినగర్‌కు వెళ్లే మార్గం పూర్తిగా తెగిపోతోంది. మోతె చెరువు సర్వే నంబర్ 406లో ఒకప్పుడు 90.23 ఎకరాల విస్తీర్ణం ఉండేది. ప్రస్తుతం కబ్జాలతో అది 40 ఎకరాలకు పడిపోయింది. 269 నుంచి 319 వరకు ఉన్న సర్వే నంబర్లలో సుమారు 790 ఎకరాల శిఖం భూమిలో 55 ఎకరాలకు పైగా కబ్జాకు గురైంది. ఎఫ్టీఎల్ పరిధిలోనే 280 వరకు ఇళ్ల నిర్మాణాలు జరిగాయన్న ప్రచారం ఉంది.
మోతె చెరువు నుంచి ముప్పారపు చెరువుకు వెళ్లే వాగులు, నాలాలు రఘురాములకోట గ్రామం మీదుగా ప్రవహిస్తాయి. ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడంతో వాగుల్లో మోరం పోసి ప్లాట్లు ఏర్పాటు చేసి విక్రయించిన ఘటనలు ఉన్నాయి. ఇటీవల రఘురాములకోటకు వెళ్లే వాగు కబ్జా చేసి దారిని మళ్లించడంతో శివారు ప్రాంతాల్లోని గ్రామస్తులు ధర్నాకు దిగారు.
