
కొంతమంది దుర్మార్గులు చేసే పనులతో చెరువుల్లో నీరు విషపూరితమవుతుంది. తాజాగా కాకినాడ జిల్లాలోని ఓ చెరువులో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు విషం కలిపారు. దీంతో లక్షల విలువైన మత్స్య సంపద మృత్యువాత పడింది. ఈ నీరు మనుషులు తాగితే ఏమయ్యేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బతుకు రోడ్డుపాలు
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఆర్బీపట్నం రాఘవమ్మ చెరువులో లక్షల చేపలు మృతి చెందాయి. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో విషం కలపడంతోనే చేపలు చనిపోయాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీంతో తమ బతుకు రోడ్డుపాలు అయిందని స్థానిక జాలర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ చెరువు తమకు ఎంతో ఆధారంగా ఉందని, ప్రస్తుతం కొంతమంది చేసిన దురాగత చర్యలతో చేపలు చనిపోవడంతో తాము జీవనాధారం కోల్పోయామని స్థానిక జాలర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
చలించిపోయిన గ్రామస్తులు
స్థానికుల కథనం ప్రకారం .. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో విషం కలపడం వలన లక్షలాది చేపలు మృతి చెంది ఒడ్డుకు చేరాయి. గ్రామస్థులు తండోపతండాలుగా వచ్చి వీటిని చూసి చలించిపోయారు. చెరువులో రొయ్యలు, వివిధ రకాల చేపలు చనిపోయాయి. ఇది కావాలని కొందరు గిట్టని వాళ్లు చెరువులో విషం కలిపారని గ్రామస్థులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విషం కలిపిన వారిపై కేసులు నమోదు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
గిట్టని వారా.. ఆకతాయి చేష్టలా..
విష ప్రభావంతో చనిపోయిన చేపలన్నీ నీటిపై తేలియాడుతూ ఒడ్డుకు కొట్టుకువచ్చాయి ఇలా చేపల మృతితో లక్షలాది రూపాయలు నష్టపోయిన అక్వా రైతు లబోదిబోమంటున్నాడు. ఈ చెరువును కొందరు లీజుకు తీసుకుని చేపల పెంపకాన్ని చేపట్టారు. అయితే వీరంటే గిట్టవారో లేక ఆకతాయి చేష్టలతోనో చెరువు నీటిలో విషం కలిపారు. దీంతో మంచి బరువు పెరిగిన చేపలన్నీ చనిపోయాయి. చెరువు ఒడ్డుకు కుప్పలు కుప్పలుగా చేపలు కొట్టుకురావడం చూసి లీజుదారులే కాదు ఇతరులూ బాధపడుతున్నారు. చేపల మృతితో లీజుదారులు కన్నీరు పెట్టుకుంటున్నారు. చెరువు లీజుదారులు, గ్రామస్తుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకుని మృతిచెందిన చేపలను పోలీసులు పరిశీలించారు. నీటిలో విషం కలిపి చేపలు చంపిన దుండగులను గుర్తించి తమకు న్యాయం జరిగేలా చూడాలని చెరువు లీజుదారులు కోరుతున్నారు.