
షెన్‌జెన్ (చైనా): ఇండియా స్టార్ షట్లర్లు లక్ష్యసేన్, సాత్విక్–చిరాగ్.. చైనా ఓపెన్ మాస్టర్స్–750 టోర్నీపై దృష్టి పెట్టారు. మంగళవారం నుంచి జరిగే పోటీల్లో ఫామ్‌ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. హాంకాంగ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన వీళ్లు.. చైనా ఓపెన్‌లో నెగ్గి సీజన్‌లో తొలి టైటిల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో లక్ష్యసేన్.. టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)తో తలపడనున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో నాలుగో ప్లేస్‌లో నిలిచిన ఇండియన్ ప్లేయర్ ఆ తర్వాత జరిగిన టోర్నీలో ఆ స్థాయిలో పెర్ఫామెన్స్ చేయలేకపోయాడు. గతంలో ఫామ్, ఫిట్‌నెస్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్నా ప్రస్తుతం గాడిలో పడ్డాడు. ‘నాపై నేను మరింత నమ్మకం పెంచుకోవాలి.
నేను ఎలా ఆడుతున్నానో తొలి రోజు నుంచే అదే ఫామ్‌ను కంటిన్యూ చేయాల్సి ఉంది’ అని లక్ష్య పేర్కొన్నాడు. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ నిలకడగా రాణిస్తున్నారు. ఆరు సెమీఫైనల్స్, ఒక రన్నరప్‌తో మంచి ఫామ్‌లో కనిపిస్తున్నారు. అయితే వీళ్లు కూడా ఈ ఏడాది ఇంకా తొలి టైటిల్‌ను ఖాతాలో వేసుకోలేదు. తొలి రౌండ్‌లో మలేసియాకు చెందిన జునైది ఆరిఫ్–రాయ్ కింగ్ యాప్‌తో అమీతుమీ తేల్చుకోనున్నారు. యంగ్‌స్టర్ ఆయుష్ షెట్టి.. ఐదోసీడ్ చోయు టియెన్ చెన్ (చైనీస్‌తైపీ)తో ఆట మొదలుపెడతాడు. విమెన్స్ సింగిల్స్‌లో పీవీ సింధు ఫామ్‌పై తీవ్ర ఆందోళన నెలకొంది. తొలి రౌండ్‌లో జూలీ డావల్ జాక్బోసన్ (డెన్మార్క్)తో తలపడనుంది. హాంకాంగ్ ఓపెన్‌లో క్వార్టర్స్ వరకు చేరుకున్న సింధు.. అక్కడ లైన్ క్రిస్టోఫర్సెన్ చేతిలో కంగుతిన్నది. విమెన్స్ డబుల్స్‌లో రుతపర్ణ–శ్వేతపర్ణ.. ఆంగ్ జిన్ యి–సయకా హోబరాతో, ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో.. ఫెంగ్ యన్ జీ–హుయాంగ్ డాంగ్ పింగ్ (చైనా)ను ఎదుర్కోనున్నారు.