ఘనంగా లాల్ దర్వాజా భోనాలు..క్యూ కట్టిన భక్తులు

ఘనంగా లాల్ దర్వాజా భోనాలు..క్యూ కట్టిన భక్తులు

ప్రసిద్ధిచెందిన పాతబస్తీ లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూకట్టారు. అమ్మవారికి అర్చకులు జల కడవ సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు అమ్మవారి శాంతి కళ్యాణం జరుగనుంది. అక్కన్న మాదన్న ఆలయాలతో పాటు అన్ని పురాతన అమ్మవారి ఆలయాల్లో పూజలు మొదలయ్యాయి. ఆలయ కమిటీ అధికారులు కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుతున్నారు. గోల్కొండ జగదాంబిక, సికింద్రాబాద్ మహంకాళి బోనాలతోపాటు.. పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలు ఎంతో విశిష్ఠమైనవిగా భక్తులు భావిస్తారు. లాల్ దర్వాజతోపాటు.. నగరంలోని ఆలయాల్లో ఘనంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. బోనాల సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బోనాల పండుగ సందర్భంగా నగరంలో కొత్త శోభ కనిపిస్తోంది.

హైదరాబాద్ పాత బస్తీలోని 23 దేవాలయాల్లో బోనాలు వేడుకలు జరుగుతున్నాయి. లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి, అక్కన్న మాదన్న టెంపుల్, మీరాలంమండి మహంకాళి, బేలా ముత్యాలమ్మ, ఉప్పుగూడ మహాకాళేశ్వర అమ్మవారి ఆలయంతో పాటు.. అన్ని పురాతన గుడుల్లో బోనాల ఉత్సవాలు జరగుతున్నాయి. ఉదయం ఆరు గంటల నుంచి అమ్మవార్లకు బోనాలు సమర్పించేందుకు భక్తులను అనుమతిస్తున్నారు. సాయంత్రం ఐదింటికీ అమ్మవార్లకు శాంతి కల్యాణం జరుగుతుంది.  

రేపు ఏడింటి నుంచి మధ్యాహ్నం వరకూ భవిష్యవాణి, సాయంత్రం నాలుగింటికీ అక్కన్న మాదన్న అమ్మవారి ఆలయం నుంచి అంబారీ ఊరేగింపు ఉంటుంది. ఈ ఏడాది కర్ణాటక నుంచి లక్ష్మి అనే ఏనుగును తీసుకొస్తున్నారు. రేపు సాయంత్రం ఐదింటికి ఉమ్మడి ఆలయాల నుంచి ఘటాల ఊరేగింపు మొదలవుతుంది. ప్రతి ఆలయం దగ్గరా హెల్త్ క్యాంప్, వాటర్ పాయింట్స్ ఏర్పాటు చేశారు.  బోనాలు సమర్పించే మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు పెట్టారు.

బోనాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. పాతబస్తీలో లాల్  దర్వాజ అమ్మవారికి ఇవాళ బోనాలు, రేపు ఘటాల ఉరేగింపు ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్  ఆంక్షలు విధిస్తూ కమిషనర్  ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. ఈ ఉత్తర్వులు చార్మినార్ , మీర్ చౌక్ , ఫలక్ నుమా, బహదూర్ పుర ప్రాంతాల్లో అమలులో ఉంటాయి. ఆర్టీసీ బస్సులు చార్మినార్ , ఫలక్ నుమా, నయాపూల్  వైపు అనుమతించరు. సీబీఎస్ , అఫ్జల్ గంజ్ , దారుల్ షిఫా ఎక్స్  రోడ్ , ఇంజన్ బౌలి రూట్లలో వెళ్లాలని సీపీ సూచించారు.

బోనాల సందర్భంగా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు పోలీసులు. అలియాబాద్  వైపు నుంచి వచ్చే వాహనాలను పోస్టాఫీస్ కు ఎదురుగా, శాలిబండ వద్ద సింగిల్  లైన్ , అల్కా థియేటర్  బహిరంగ ప్రదేశంలో పార్కు చేయాలి. హరిబౌలి నుంచి వచ్చే వాహనాలను ఆర్యా మైదాన్ , సుధా థియేటర్  లేన్ , అల్క థియేటర్  ఓపెన్  ప్లేస్  లో పార్కింగ్ చేయాలి. ఛత్రినాక ఓల్డ్  పీఎస్  వైపునుంచి వచ్చే వాహనాలను వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం, లక్ష్మీనగర్ , సరస్వతి విద్యానికేతన్ , ప్రభుత్వ జూనియర్  కాలేజీ, ఫలక్ నుమా, పత్తర్  కి దర్గా సమీపంలో పార్కు చేయాలి. మూసాబౌలి, మీర్ చౌక్  వైపు నుంచి వచ్చే వాహనాలను చార్మినార్  బస్  టర్మినల్ లో పార్కు చేయాల్సి ఉంటుంది. పాతబస్తీలో జరిగే బోనాల పండక్కి 8వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హోంగార్డు నుంచి అన్ని స్థాయిల అధికారులు బందోబస్తులో పాల్గొంటారన్నారు సీపీ అంజనీకుమార్. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా ఊరేగింపును పర్యవేక్షిస్తామన్నారు సీపీ అంజనీ కుమార్.

అంబర్ పేట మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జూలై 18వ తేదీన ఘటం ఊరేగింపుతో ఇక్కడ బోనాలు ప్రారంభమయ్యాయి. 31వ తేదీ వరకు ఘటం అన్ని బస్తీలలో తిరిగింది. ఇవాళ ఉదయం 4 గంటల నుంచి 6 వరకు అమ్మవారికి అభిషేకము నిర్వహించారు. 8 నుంచి రాత్రి 8 వరకు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు భక్తులు. రేపు తెల్లవారు జామున 3 గంటల నుంచి అమ్మవారి ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం భవిష్యవాణి  కార్యక్రమం ఉంటుంది. 3 గంటలకు పోతరాజుల ప్రదక్షణ, సాయంత్రం 4 గంటలకు బలిగంప, 6 గంటలకు అమ్మవారిని సాగనంపుతూ చేసే ఊరేగింపుతో బోనాల జాతర పూర్తికానుంది. అటు నింబోలిఅడ్డ మహంకాళి దేవాలయంలోనూ బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.  236 సంవత్సరాల చరిత్రగల నింబోలిఅడ్డ మహంకాళి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు.