ఆత్మీయులు ఎవరైనా చనిపోయినా లేదా విడిపోయినా.. వారి జ్ఞాపకాలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఇంకా చెప్పలేకపోయిన కృతజ్ఞతలు, మిగిలిపోయిన క్షమాపణలు.. లాంటి భావోద్వేగాల్ని తన కవిత్వంలో జొప్పిస్తూ.. ఒక సామాజిక బాధ్యతతో.. చిత్రీకరించిన కవితలివి. ఇది ఎలిజి రకపు కవిత్వం. రచయిత కథా వస్తువుగా కుటుంబాల మధ్యన, బాంధవ్యాల నడుమ ఏర్పడ్డ అభిప్రాయ భేదాలు, అసూయ ద్వేషాలను చెబుతూనే ప్రతి కవిత చివరన క్షమాపణాపూర్వకంగా మళ్లీ ఈ తప్పులు చేయనని ముగిస్తాడు. కొన్ని మనసును హత్తుకుంటే.. మరికొన్ని మనసుని తట్టి లేపుతాయి.
- మచ్చుకు కొన్ని..
పుణ్యం, పాపం..
గత జన్మ.. ఈ జన్మ.. పునర్జన్మ.. అబ్బో
ఆ ఆశే మనిషిని హుషారు చేసింది..
అంటూ చెప్పే కవితలో ‘ఆశ అనేది మనిషిని అవకాశవాది’గా మారుస్తుంది అంటాడు.
మరో కవితలో ‘ఇంట్లో ఉంటే తెలుస్తుంది.
వెంట ఉంటే తెలుస్తుంది. పెళ్లైతే.. సమస్యలు వెంటే ఉంటాయి. అయినా సరే గుండెను విప్పాలి.. అన్నీ పంచుకోవాలి.. అన్నీ అడిగి చేయాలి’ ఎందుకంటే ఆలుమగల మధ్య ఏ గుట్టు ఉండకూడదు కదా!
లోపల ఒకటి..
పైకి ఒకటి..
పైకి తేనె మాటలు..
లోపల విషపు గుళికలు..
బంధాలు ఏవైనా..
కొందరుంటారు..
మంచి కంటే చెడు చేసి పోతారు.
చెడిపోతే చూసి నవ్వుతారు. వారిని లోతు తెలియని ‘మారియనా ట్రెంచ్’లంటాడు.
కాదంబరి..
గంధర్వి..
ప్రేమ వర్షిణీవి..
కోటి వరహాల చిరునవ్వు..
అంటూ నీతో ఏనాడు అనలేదు.. చెప్పలేదు. నా అజ్ఞానమే తప్ప ఇది అహం కాదు.. అంటూ భర్త తన తప్పులను చెబుతూనే అసలైన ‘మెచ్చుకోలు’ ఏంటో ఇక్కడ చెబుతాడు.
కోపం, అసూయ, భయం, సంతోషం, విచారం, ఆశ్చర్యం లాంటి భావోద్వేగాలు ఏవైనా.. భార్య తన భర్తతోనే పంచుకుంటుంది. ‘ఏం జరిగినా భర్తనే అంటుంది’.. అలా అని తన భార్య అన్న మాటల్ని అవతలివారికి రెట్టింపు చేసి చెప్తే అతడికే చేటు!
‘నా ఇష్టం.. నీకు కష్టం.. అయినా చదివావు.. గమ్యం లేని చదువు గత్తర లేపింది!’ చదువుకు ఒక గమ్యం, లక్ష్యం అంటూ ఉండాలి. లేకుంటే ఎంత చదివినా ఉపయోగం ఉండదు. చివరికి భవిష్యత్తు అగమ్యగోచరం అయినట్టే కదా!
అరుణ గారు’ అలానే పిలిచేవాడ్ని..
భయంతోనైతే కాదు..
అతి మితిమీరిన ప్రేమతో..
నీవు చెప్పే ప్రతిదీ నాకు తెలిసినా..
అదంతా సోదైనా నే వినాలి!
సర్లే నాకు తెలుసన్నాను..
అప్పుడు నీ మనసెంత క్షోభ పడిందో..
అప్పుడు నాకు తెలియదు, తెలిసిందిప్పుడు..
అంటూ ‘సోదైనా వినాలి’ కవితలో చెబుతాడు.
నేనంటే ఇష్టం లేదు..
ప్రేమలేదు..
నన్ను పట్టించుకోరు, లెక్కచేయరు..
ఫలానాదంటే ఇష్టమేమో..
పుట్టింటికి వెళ్తానంటే.. వెళ్తుంటే గుబులు.. బుగులు.. కొంచెం తేడా వచ్చినా.. ‘ఆయనకు నేనంటే ఇష్టం లేదు’లో నేటితరం ఆడవాళ్లు చిన్న మార్పుకే అనుకునే అపోహను చెప్తాడు.
‘నాకు మూడు పెళ్లిరోజులు..’
నువ్వు పుట్టినరోజు..
మన పెళ్లి రోజు..
నువ్వు గిట్టిన రోజు.. అంటూనే తనతో ముడిపడిన జీవితం ఇదే అని వివరిస్తాడు.
ఇవేకాక స్టౌ లైటర్, కుట్రలు తెలియని పుట్టుకలు,
మందు, మగువ లేకుంటే ఒంటరి జీవితం అద్భుతం! లాంటి మరిన్ని కవితలు ఇందులో ఉన్నాయి.
రోజులు మారాయి. మన భావోద్వేగాలు మారాయి. లౌక్యం తెలియక గందరగోళంలో ఉన్న తోటి వ్యక్తి పట్ల అసూయ, కుళ్ళు, శాడిజంతో ప్రవర్తించడం వల్ల ఏర్పడ్డ పరిస్థితులను రచయిత గుర్తించి, వాటిని తన కవితా వస్తువులుగా తీసుకొని చెప్పే కొత్త ప్రయత్నమిది.
►ALSO READ | జ్యోతిష్యం : మిథున రాశిలోకి గురుడు, చంద్రుడు : ఈ మూడు రాశులకు ఊహించని మంచి ఫలితాలు..!
