- ఇక 12వ తరగతి దాకా స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకే
- సర్కారు గ్రీన్ సిగ్నల్‌తో సిద్ధమైన డ్రాఫ్ట్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దశాబ్దాలుగా ప్రత్యేక విభాగంగా కొనసాగుతున్న ఇంటర్మీడియెట్ బోర్డును రద్దు చేసి స్కూల్ ఎడ్యుకేషన్‌లో విలీనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈమేరకు 1971 నాటి తెలంగాణ ఇంటర్మీడియెట్ విద్యా చట్టాన్ని రద్దు చేస్తూ, 1982 నాటి విద్యా చట్టానికి సవరణలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ డ్రాఫ్ట్ రెడీ చేసింది. దీని ప్రకారం ఈ విద్యాసంవత్సరం (2026–27) నుంచే ఇంటర్మీడియెట్ కోర్సు పూర్తిగా రద్దయి 11, 12 తరగతులు హై స్కూల్ పరిధిలోకి రానున్నాయి.
దేశవ్యాప్తంగా తెలంగాణ, ఏపీ సహా ఏడు రాష్ట్రాల్లో మాత్రమే ఇంటర్ బోర్డులున్నాయి. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో 11, 12 తరగతులు హైస్కూల్లో భాగంగానే కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న సీబీఎస్సీ స్కూళ్లలోనూ ఇదే విధానం అమలవుతున్నది. కానీ ఇంటర్మీడియెట్ ప్రత్యేక కోర్సుగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఏటా వేల కోట్ల దందాకు పాల్పడుతున్నాయి. అదే సమయంలో 10వ తరగతి తర్వాత కాలేజీలకు వెళ్లే పరిస్థితి లేక చాలా మంది డ్రాపవుట్స్‌గా మిగిలిపోతున్నారని, ప్రధానంగా వెనుకబడిన వర్గాల్లో బాలికలకు తల్లిదండ్రులు పెళ్లిచేసి పంపిస్తున్నారని, ఫలితంగా గ్రామీణ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని సర్కారు నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలో ఇంటర్మీడియెట్నూ స్కూల్ఎడ్యుకేషన్లో విలీనం చేయాలని నిర్ణయించింది.
కేంద్ర విద్యాశాఖ సైతం
రాష్ట్రంలో ఇంటర్ విద్య విడిగా ఉండడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులను తెచ్చుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. నిజానికి కేంద్ర విద్యాశాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో 10, 12 తరగతులకు ఉమ్మడి బోర్డు ఉండాలని స్పష్టం చేసింది. 11, 12 తరగతులు స్కూల్ ఎడ్యుకేషన్ కిందికి వస్తేనే సమగ్ర శిక్ష , పీఎం శ్రీ స్కీముల కింద బిల్డింగ్‌లు, టీచర్ల ట్రైనింగ్, కంప్యూటర్ ల్యాబ్‌ల కోసం నిధులు వస్తాయి. అందువల్ల ఇంటర్ ను విలీనం చేస్తే కేంద్రం నుంచి అధిక నిధులు పొందవచ్చని సర్కారు భావిస్తున్నది. తద్వారా రాష్ట్ర ఖజానాపై భారం తగ్గించుకోవచ్చని ప్లాన్ చేస్తోంది.
గతేడాదే నిర్ణయం
రాష్ట్రంలో టెన్త్, డీఈడీ, టీటీసీతో పాటు పలు కోర్సులకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఎగ్జామ్స్ నిర్వహిస్తుండగా, ఇంటర్మీడియేట్ లో ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ఇంటర్ బోర్డు పరీక్షలు పెతుడున్నది. ఇంటర్మీడియెట్విలీనంతో ప్రస్తుతం ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (ఎస్ఎస్సీ బోర్డు), ఇంటర్మీడియెట్ బోర్డులను కలిపి కామన్బోర్డుగా మార్చాలని తెలంగాణ విద్యా కమిషన్ తో పాటు డ్రాఫ్ట్ ఎడ్యుకేషన్ పాలసీ కోర్ కమిటీ ప్రభుత్వానికి ఇప్పటికే సిఫార్సు చేశాయి. జూన్ 2025లో కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. టెన్త్, 12 తరగతులకు ఒకే కామన్ బోర్డు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త బోర్డుకు విద్యాశాఖ సెక్రటరీ నేతృత్వంలో ఒకే హెడ్ ఉంటారు. ఈ సిఫార్సులకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు తగ్గడంతో పాటు, విద్యా నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
మూడు రోజులుగా కసరత్తు
కేంద్ర విద్యాశాఖ ఆదేశాలతో పాటు పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్ విలీనంపై అధికారులకు సంకేతాలిచ్చారు. కానీ ఇంతకాలం విద్యాశాఖ ఉన్నతాధికారులు కనీసం ప్రతిపాదనలు రెడీ చేయలేదు. చివరికి ఈ నెల 4న ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లపై ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభివన్ షెడ్యూల్ రిలీజ్ చేయగా, సీఎంఓ వర్గాలు సీరియస్ అయినట్టు తెలిసింది. ఇంటర్ బోర్డు విలీనం చేయకుండా.. ఎలా అడ్మిషన్ నోటిఫికేషన్ ఇస్తారని ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో హడావుడిగా ఈ నెల 5న అడ్మిషన్ షెడ్యూల్ రద్దు చేసి, ఆ రోజు నుంచి ఇంటర్ విలీనంపై సమీక్షలు మొదలుపెట్టారు. విద్యాశాఖ ఇన్చార్జి సెక్రటరీ శ్రీదేవసేన నేతృత్వంలో ఇంటర్మీడియెట్, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులతో పలు భేటీలు నిర్వహించారు. ఈక్రమంలో ఇప్పటికే విలీనం ఆర్డినెన్స్ డ్రాఫ్ట్ రెడీ కాగా, రెండు, మూడు రోజుల్లో రిలీజ్చేయనున్నట్లు తెలిసింది.
హడావుడి నిర్ణయంపై ఆందోళన
విలీన ప్రక్రియపై విద్యాశాఖలోని కొందరు అధికారులతో పాటు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి ముందస్తు కసరత్తు లేకుండా, స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడంతో సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. టీచర్ల సర్దుబాటు, సీనియారిటీ సమస్యలు, పరీక్షల నిర్వహణలో గందరగోళం ఏర్పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. హడావుడిగా చట్టాలు మార్చడంతో భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు కూడా రావొచ్చని చెప్తున్నారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు కనీసం లెక్చరర్లు, టీచర్ల సంఘాల అభిప్రాయాలను తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
