షాద్ నగర్ లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ఓనర్లమంటూ రెడీమిక్స్ కాంక్రీట్ వ్యాపారిని రూ.16 లక్షలు మోసం చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల దగ్గరి నుంచి నగదుతో పాటు కే కారు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. షాద్‌నగర్‌కు చెందిన చిల్లా సూర్య ప్రతాప్ రెడ్డి రెడీమిక్స్ కాంక్రీట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. మే 2వ తేదీన కమ్మరి రమేష్ (అలియాస్ విశాల్) అనే వ్యక్తి సూర్య ప్రతాప్ రెడ్డిని సంప్రదించి, కొత్తూరులో తనకు ఓ భవనం నిర్మాణం లో ఉందని, దానికి కాంక్రీట్ కావాలని చెప్పి నమ్మించి రూ. 50 వేలు అడ్వాన్స్ చెల్లించి కాంక్రీట్ ఆర్డర్ ఇచ్చాడని.. మిగిలిన రూ. 4లక్షల 23 వేల 500 పని పూర్తయ్యాక ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడని బాధితుడు తెలిపాడు.
తీరా పని పూర్తయ్యాక, డబ్బులు అడగగా బ్యాంకు ద్వారా బదిలీ చేస్తానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని.. అనుమానం వచ్చి భవనం దగ్గరికి వెళ్లి విచారించగా, విశాల్ ఆ భవన యజమాని కాదని, అసలు యజమాని నుండి విశాల్ అప్పటికే కాంక్రీట్ పనికి సంబంధించిన పూర్తి డబ్బును వసూలు చేసుకున్నాడని తెలిసి నిర్ఘాంతపోయానని అంటున్నాడు బాధితుడు.
నిందితులు కమ్మరి రమేష్ (A1), వేముల ప్రేమ్ కుమార్ (A2) కలిసి పథకం ప్రకారం కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లను గుర్తిస్తారని... తామే యజమానులమని అబద్ధం చెప్పి రెడీమిక్స్ సరఫరాదారులను సంప్రదించేవారని తెలిపారు పోలీసులు. అడ్వాన్స్ ఇచ్చి కాంక్రీట్ వేయించి... అనంతరం అసలు యజమానుల నుండి డబ్బులు వసూలు చేసుకుని, సరఫరాదారులకు మాత్రం చెల్లించకుండా పరారయ్యేవారని తెలిపారు పోలీసులు.
ఇదే తరహాలో నిందితులు చేవెళ్ల, గజ్వేల్, చాంద్రాయణగుట్ట, గచ్చిబౌలి ప్రాంతాల్లో సుమారు రూ. 16లక్షల 50 వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు పోలీసులు. మే 8న ఇన్ముల్ నర్వ గ్రామంలో మరో మోసానికి రెడీ అవుతుండగా.. చాకచక్యంగా నిందితులను పట్టుకున్నామని తెలిపారు పోలీసులు. నిందితుల నుండి రూ.2లక్షల 39వేల 500 నగదు, ఒక కారు, ఐదు మొబైల్స్ ను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించామని తెలిపారు పోలీసులు.
