సోయం బాపూరావు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం : కిషన్ రెడ్డి

సోయం బాపూరావు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం :  కిషన్ రెడ్డి

తెలంగాణలోని లంబాడీలపై బీజేపీ ఎంపీ సోయం బాపూరావు చేసిన కామెంట్స్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు.  భారీ వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాలను సంధర్శించేందుకు జనగామ వెళ్లిన  ఆయనకు బాపూరావును సస్పెండ్ చేయాలని కోరుతూ గిరిజన సంఘం నాయకులు ఆయనకు వినతిపత్రం అందజేశారు.  

ఈ  సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సోయం బాపూరావు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని , పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు చేయాలని రాజ్యాంగంలో ఉంది. ఎస్టీలకు రిజర్వేషన్లు రాకుండా గత తొమ్మిది సంవత్సరాలుగా వారికి అన్యాయం చేసిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదని కిషన్ రెడ్డి ఆరోపించారు.  రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతామని,  వీలైతే ఎన్నికల ముందే పెంచడానికి ప్రయత్నం చేస్తామని కిషన్ రెడ్డి స్పష్ట చేశారు.  

పర్యటనలో భాగంగా జనగామలో మీడియాతో మాట్లాడిన కిషన్.. గత వారం రోజులుగా రాష్ట్రంలో కురిసిన వర్షాలకు అనేక జిల్లాలో ప్రజలు నష్టపోయారన్నారు. పంటలు, పశువుల, రోడ్లు కూడా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ బృందాలు వరద సహాయ కేంద్రాలలో తిరుగుతాయని కిషన్ రెడ్డి చెప్పారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. 

కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రాష్ట్ర నాయకత్వం కలిసి వారికి రాష్ట్రంలో ఏర్పడిన వరద పరిస్థితులు వివరించిందన్నారు. త్వరలోనే కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపిస్తామని అమిత్ షా చెప్పినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.