గద్వాల, వెలుగు: మల్లమ్మ కుంట రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియ స్పీడప్ చేయాలని, వెంటనే తనగల రైతులతో గ్రామసభలు నిర్వహించాలని జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నెట్టెంపాడు, గట్టు లిఫ్ట్ స్కీమ్‌లతో పాటు మల్లమ్మ కుంట రిజర్వాయర్ భూసేకరణపై సర్వే, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రైమరీ డిక్లరేషన్ పూర్తయి అవార్డు స్థాయిలో ఉన్న భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో జాయింట్ ఇన్స్ఫెక్షన్ పూర్తి చేసి భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. ఆర్ అండ్ ఆర్ సెంటర్లలో వసతుల కల్పనకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
అనంతరం ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొని విద్యలో జిల్లాను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రోత్సహించాలని కోరారు.
