టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీలో భూ దందా!

టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీలో భూ దందా!

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా కేంద్రంలో టీఎన్జీవో  హౌసింగ్ సొసైటీ వేదికగా ఇన్నేళ్ల నుంచి పాల్పడిన అక్రమాలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వం కేటాయించిన రూ.300 కోట్ల విలువైన భూమిలో సభ్యులకు ప్లాట్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడడం ఒక ఎత్తైతే, దాన్ని ఆనుకొని ఉన్న మరో 30 ఎకరాల భూమిని ఆక్రమించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. గవర్నమెంట్​రూల్స్, గతంలో ఇచ్చిన జీవోలను తుంగలో తొక్కి బై నంబర్ల మాయాజాలంతో ఇప్పటికీ రిజిస్ట్రేషన్ల దందా కొనసాగిస్తున్నారు. యూనియన్ నేతల ముసుగులో చేసిన అక్రమాలపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు, ఫిర్యాదులు వస్తుండడంతో మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు.

ఇష్టం వచ్చిన వారికి సభ్యత్వాలు

2005లో ఖమ్మం రూరల్ మండలంలోని ఏదులాపురం, దానవాయిగూడెం శివారు ప్రాంతాల్లో 103 ఎకరాల 26 కుంటల భూమిని ఎకరం రూ. 40 వేల చొప్పున ప్రభుత్వం టీఎన్జీవోస్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి కేటాయించింది. సొసైటీకి భూమిని కేటాయించే సమయానికి సభ్యుల సంఖ్య 1,686 ఉంది. సొసైటీలో అంతకు మించి సభ్యులను చేర్చుకోరాదని రూల్స్​లో స్పష్టం చేశారు. ఖమ్మం రెవెన్యూ డివిజన్ పరిధిలోని సభ్యులకు మాత్రమే ఈ కేటాయింపు జరగాల్సి ఉండగా సొసైటీ నాయకులు మాత్రం పెడచెవిన పెట్టారు. హైదరాబాద్, ఢిల్లీల్లో పనిచేస్తున్న వారికీ ప్లాట్లు అమ్ముకున్నారని, ఉద్యోగులు కానివారికి, కొందరు రాజకీయ నాయకులకు కూడా ప్లాట్లు కేటాయించారన్న ఫిర్యాదులున్నాయి.

విజిలెన్స్ ఆదేశాలు బుట్టదాఖలు

సొసైటీలో అక్రమాలపై కొందరు సొసైటీ సభ్యులు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన విజిలెన్స్ డిపార్ట్మెంట్ అక్రమాలు నిజమేనని 2016 లో తేల్చింది. సొసైటీ అధ్యక్షుడు, ఇతర సభ్యుల మీద చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీ రాజ్ కమిషనర్, వరంగల్ రీజనల్ విజిలెన్స్ ఆఫీసర్, జిల్లా సహకార అధికారిని ఆదేశించినా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఈ సొసైటీలో కొత్తగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయొద్దని ఖమ్మం, కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ లకు ఆదేశాలు అందాయి. అయినా ఈ ఏడాది మార్చి వరకు కూడా రిజిస్ట్రేషన్లు కొనసాగుతుండడం గమనార్హం. జీవో విడుదలైన తేదీ నుంచి రెండేళ్లపాటు మాత్రమే సభ్యులకు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించి సొసైటీ కార్యకలాపాలు నిలిపి వేయాలని రూల్​ ఉన్నా 15 సంవత్సరాలు దాటినా రిజిస్ట్రేషన్ ల పర్వం కొనసాగుతూనే ఉంది.

అసైన్డ్, సీలింగ్ భూములకు ఎసరు

సొసైటీకి భూమి కేటాయించిన సమయంలో 1,686 మంది సభ్యులున్నారు. వీరికి ఒక్కొక్కరికి 175 గజాల చొప్పున ఇంటి స్థలాన్ని కేటాయించాలని రూల్స్​ ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పటివరకు 1,400 మంది కొత్తగా సభ్యులుగా చేర్చారు. కొత్తవారు ఒక్కొక్కరి నుంచి  రూ.5 లక్షల వరకు వసూలు చేసి ప్లాట్లు కేటాయించినట్టు కలెక్టర్​కు ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వం కేటాయించిన భూమిని ఆనుకొని ఉన్న అసైన్డ్, సీలింగ్, ప్రభుత్వ భూములను దాదాపు 30 ఎకరాలు ఆక్రమించుకొని ప్లాట్లు చేశారని ఆరోపణలున్నాయి. అదనంగా సభ్యత్వం ఇచ్చిన 1400 మందిలో దాదాపు 40 శాతం సభ్యులకు ఈ ఆక్రమించిన స్థలాల్లోనే ప్లాట్లు చేసి ఇచ్చారని సమాచారం.

అక్రమాలపై దర్యాప్తు చేయించాలని కోరాం

సొసైటీలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేస్తూ ఉద్యోగులు కానివారికి, వారి బంధువులు, కుటుంబసభ్యులకు, కొందరు ప్రజాప్రతినిధులకు కూడా ప్లాట్లు కేటాయిస్తున్నారు. సొసైటీలో కీలక నేతలు డబ్బులు తీసుకొని కోట్ల రూపాయలు అక్రమార్జన చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాం.

‑ అఫ్జల్ హసన్, ఫిర్యాదుదారుడు

ఆరోపణల్లో నిజం లేదు

ప్రభుత్వం కేటాయించిన భూమి తప్ప సొసైటీ ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదు. ఉద్యోగాలు చేయకుండా పైరవీలు, భూ దందాలు చేసేవారే నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఫిర్యాదులు, ఆరోపణలు చేస్తున్నవారు గతంలో కోర్టుకు కూడా వెళ్లారు. 2016లో త్రీ మెన్ కమిటీ రిపోర్ట్ పై కోర్టు స్టే ఇచ్చింది. అయినా కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

–  ఏలూరి శ్రీనివాసరావు, హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు

For More News..

పెండ్లికి పోతే దావత్ బదులు..

2 ఇన్​ 1 మెడిసిన్! కరోనాకు సరికొత్త మందు

వచ్చే జనవరిలో శశికళ రిలీజ్!