వీరు చేసిన తప్పేంటి?: కుల బహిష్కరణ వేటుతో.. ఐదేండ్లుగా దంపతుల వెలి

వీరు చేసిన తప్పేంటి?: కుల బహిష్కరణ వేటుతో.. ఐదేండ్లుగా దంపతుల వెలి

బయ్యారం వెలుగు: మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు.. అంటూ ఓ కవి రాసిన పాట అక్షరాల నిజమైంది. తమ మాటను లెక్క చేయలేదన్న కోపంతో కులం నుంచి వెలివేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని రామచంద్రాపురం పంచాయతీ పరిధిలో పందిపడే గ్రామం పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉంది. ఈ ఊర్లో లంబాడ 22, కోయ 23 కుటుంబాలు ఉన్నాయి. సోలెం భద్రయ్య , కారెం కోటమ్మ కుటుంబాలు గ్రామం ఏర్పడినప్పటి నుంచి పోడు భూమి కొట్టుకొని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఈ భూమికి ప్రభుత్వం పట్టా సైతం ఇచ్చింది. వీరి భూమిని ఎలాగైనా కబ్జా చేయాలని గ్రామంలో కొందరు పెద్ద మనుషులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. 2014 సంవత్సరంలో కుల బహిష్కరణ వేటు విధించారు. నాటి నుంచి నేటివరకు గ్రామంలో ఏ కార్యం జరిగినా చెప్పడం లేదని, తమతో ఎవరు మాట్లా డటంలేదని బాధితులు తెలిపారు. అంతేకాకుండా వీరి ఇంటికి ఎవరైనా వెళ్లినా, వీరి పొలం ఎవరైనా దున్నినా రూ. 5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారన్నారు.

ఇటీవల మిషన్ భగీరథ పథకంలో భాగంగా అధికారులు ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చారు. తమ ఇండ్లకు ఇచ్చిన నల్లా కనెక్షన్ గ్రామపెద్దలు తొలగించారని, ఇంటికి ఉన్న కరెంటు కనెక్షన్ సైతం కట్ చేసి తమను అంధకారంలో ఉంచుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయంపై ఐదేళ్లుగా తిరగని ఆఫీసులు లేవని, అయినా తమ పరిస్థితిపై స్పదించడం లేదని గోడు వెళ్లబోసుకున్నారు.