పోలీసులపై ఆగ్రహం.. పరిహారం చెల్లించాకే పనులు చేయాలి

పోలీసులపై ఆగ్రహం.. పరిహారం చెల్లించాకే పనులు చేయాలి

చర్లగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితుడి ఆత్మహత్యా యత్నం
మునుగోడు/ మర్రిగూడ, వెలుగు: భూ నిర్వాసితుడు ఒకరు ఆత్మహత్యకు యత్నించారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని చర్లగూడెం ప్రాజెక్టు నిర్మాణంలో శివన్నగూడెం, నర్సింహులగూడెం గ్రామాలవారు భూములు కోల్పోయారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాకే పనులను ప్రారంభించాలని నిర్వాసితులు రెండు రోజులుగా పనులను అడ్డుకుంటున్నారు. శనివారం సైతం పనులు ప్రారంభించకుండా నర్సింహులగూడెంకు చెందిన నిర్వాసితుడు లోడే యాదయ్య అడ్డుకున్నారు. మర్రిగూడ ఎస్సై క్రాంతి కుమార్ అక్కడకు చేరుకుని నిర్వాసితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా యాదయ్య, ఎస్సై మధ్య వాగ్వాదం జరిగింది. ఇలా చేస్తే ప్రాణ త్యాగానికైనా వెనకాడనని యాదయ్య అన్నారు. ఎస్సై పట్టించుకోకపోవడంతో యాదయ్య పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న యాదయ్యను మండల కేంద్రంలోని హాస్పిటల్ కి తీసుకువెళ్లగా పరిస్థితి విషమించిందని డాక్టర్  చెప్పారు. దాంతో మెరుగైన ట్రీట్​మెంట్​కోసం హైదరాబాద్ తరలించారు. ఈ ఘటనతో నర్సింహులగూడెం, శివన్నగూడెం, చర్లగూడెం గ్రామాలకు చెందిన భూ నిర్వాసితులు మండల కేంద్రానికి వచ్చి రోడ్లపై బైఠాయించారు. అక్కడికి వచ్చిన జడ్పీటీసీ సురేందర్​రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ ఘటనా స్థలానికి చేరుకొని సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.