కోర్టు కేసులున్నభూములకు ధరణిలో రిజిస్ట్రేషన్

కోర్టు కేసులున్నభూములకు ధరణిలో రిజిస్ట్రేషన్
  • లోపాలను వాడుకుంటున్న అక్రమార్కులు
  • చాలాచోట్ల వివాదాలున్న భూముల సర్వే నంబర్లను బ్లాక్ చేయలే
  • జగిత్యాలలో తాజాగా మరో వివాదాస్పద రిజిస్ట్రేషన్​

జగిత్యాల క్రైం, వెలుగు: అగ్రికల్చర్​ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల కోసం రాష్ట్రప్రభుత్వం హడావిడిగా తెచ్చిన ధరణి పోర్టల్​లో లోపాలు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. రెవెన్యూ, సివిల్​ కోర్టుల్లో పెండింగ్​లో ఉన్న  భూముల సర్వే నంబర్లను బ్లాక్​ చేయకపోవడంతో అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. తాజాగా జగిత్యాలలో ఇలాంటి డిస్ప్యూట్​ ల్యాండ్​ రిజిస్ట్రేషన్​ జరగడంతో ఆఫీసర్లు తలపట్టుకున్నారు. మొన్నటి మొన్న పెండింగ్​ మ్యుటేషన్ల విషయంలోనూ ఇలాగే డబుల్​ రిజిస్ట్రేషన్లు జరగగా, తాజాగా మరో లోపం బయటపడడంతో ధరణి పోర్టల్​ పనితీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను ప్రారంభించేటప్పుడు ఆర్డీవో, జేసీ కోర్టుల్లో ఉన్న కేసులను ట్రిబ్యునల్​కు  అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కానీ ఎలాంటి గైడ్​లైన్స్​ ఇవ్వకుండానే ధరణి సేవలను అధికారులు మొదలుపెట్టారు. దీంతో వివాదంలో ఉన్న భూములను కూడా కొందరు రిజిస్ట్రేషన్లు చేయించేస్తున్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్​ చేయవద్దని రెవెన్యూ కోర్టులు స్టే ఇస్తేనే లెక్కలోకి తీసుకుంటామని, మిగతా కేసుల్లో ఒక్కరోజులోనే రిజిస్ట్రేషన్లు కంప్లీట్​చేస్తామని తహసీల్దార్లు చెప్తున్నారు. ఆరు నెలల కిందటే రెవెన్యూ కోర్టులు రద్దయ్యాయి. వారు ఇచ్చిన స్టేల డెడ్​లైన్​ కూడా పూర్తయింది. దీంతో రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్​లో ఉన్న వివాదాలపై అయోమయం నెలకొంది. వివాదాలను పరిష్కరించకుండానే రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని బాధితులు వాపోతున్నారు.  రెవెన్యూ కోర్టుల్లో సుమారు 16 వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఆఫీసర్లు గుర్తించినట్టు సమాచారం. రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్ సమస్యలకు సంబంధించి కొత్త చట్టంలో ఎలాంటి గైడ్​లైన్స్​లేకపోవడంతో ఆఫీసర్లు, లిటిగెంట్లతో కలిసి అక్రమాలకు తెరలేపే అవకాశం ఉందని అంటున్నారు.

మిస్​ యూజ్​ అయ్యే చాన్స్​

కొత్త రెవెన్యూ చట్టంలో చాలా లోపాలున్నాయి. ఈ లోపాలను అక్రమార్కులు వాడుకుంటున్నారు.  రెవెన్యూ కోర్టులో పెండింగ్​లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ ​నిలిపివేయాలని, ఈ వివాదాలను బీ సెక్షన్ లో ఉంచాలని, లేదంటే సివిల్ కోర్టుకు బదిలీ చేయాలని ఎక్స్​పర్ట్స్​చెప్తున్నారు. రెవెన్యూ కోర్టుల్లో ఉన్న పెండింగ్ సమస్యలను బ్లాక్ లిస్ట్ లో పెట్టకపోవడం,  కొత్తచట్టం ప్రకారం రిజిస్ట్రేషన్​ను నిలిపివేసే అధికారం రెవెన్యూ ఆఫీసర్లకు లేకపోవడంతో చట్టాన్ని మిస్​ యూజ్​ చేసే ప్రమాదం ఉంది. కొత్త చట్టం అమలులోకి రావడంతో రెవెన్యూ కోర్టుల్లో కేసుల విచారణ కూడా ఆగిపోయింది. తమ దగ్గర పెండింగ్​లోఉన్న  కేసులను ఆయా జిల్లాల అధికారులు  ప్రభుత్వానికి నివేదించారు. ఈ కేసులపై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం  భూ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ఒక రోజులోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో అమ్మేవారు, కొనేవారు సెల్ఫ్​ డిక్లరేషన్లతోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. పాత కేసులు, మోకా తదితర అంశాలను పరిశీలించే పరిస్థితి లేదు. ఏదైనా సమస్య తలెత్తి.. కోర్టు నుంచి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఆపేస్తూ స్టే వస్తేనే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఆ విషయాన్ని  ఆర్టీవో, కలెక్టర్,
సీసీఎల్ఏకు రిపోర్టు చేస్తారు. అనంతరం సీసీఎల్ఏ ఆమోదంతో వివాదం మీద నిర్ణయం  తీసుకునే అవకాశం ఉంది.

సర్వే నంబర్లేవీ బ్లాక్ చేయలే కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం

వివాదంలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లను కూడా నిలిపివేసే అధికారం లేదు. సమస్య ఉంటే సీసీఎల్ఏ ఆదేశాలతో నిర్ణయాలు తీసుకుంటాం. రెవెన్యూ కోర్టులో పెండింగ్​లో ఉన్న భూముల సర్వే నంబర్లు  బ్లాక్​చేసే అవకాశం కూడా లేదు. వివాదంలో ఉన్న భూముల వివరాలను సైట్​లో అప్​లోడ్​ చేశాం. వీటి మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.

– దిలీప్, జగిత్యాల రూరల్ ఎమ్మార్వో