- లష్కర్ వీధుల్లో ఆధ్యాత్మిక శోభ
- వెంట నడిచిన భక్తజనం
- ముగిసిన లష్కర్ బోనాలు
పద్మారావునగర్, వెలుగు : లష్కర్లో బోనాల ఘట్టంలో కీలకమైన అంబారీపై అమ్మవారి ఊరేగింపును సోమవారం వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన ఈ ఊరేగింపు మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. అమ్మవారి ఊరేగింపు కోసం అంబారి(ఏనుగు లక్ష్మి)ని కర్ణాటకలోని బెంగళూరు జిల్లా తుముకూరు నుంచి తీసుకువచ్చారు. ముందు ఏనుగుపై అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి బ్యాండ్ మేళాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. తర్వాత సుభాష్ రోడ్డు, అల్ఫా హోటల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా మెట్టుగూడ ప్రాంతానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడి అమ్మవారి ఆలయంలో ఉజ్జయిని అమ్మవారిని పెట్టి, తిరిగి ఏనుగు ఆలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా దారి పొడవునా భక్తులు హారతులు పడుతూ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ ప్రియాంక ఆల, కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ కోట నీలిమ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
కనులపండువగా పలహార బండ్ల ఊరేగింపు
సోమవారం నిర్వహించిన పలహార బండ్ల ఊరేగింపు ఆకట్టుకుంది. సికింద్రాబాద్‌లోని గాస్‌మండి, రెజిమెంటల్ బజార్, తకార బస్తీ, జనరల్ బజార్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు రంగు రంగుల లైట్లు, పూలతో ప్రత్యేకంగా అలంకరించిన పలహార బండ్లలో అమ్మవారి నైవేద్యాలను ఉంచి భారీ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. డప్పు చప్పుళ్లు, భాజాభజంత్రీలు, పోతరాజుల నృత్యాల బండ్ల ఊరేగింపు సాగింది. అర్ధరాత్రి వరకు ఈ కార్యక్రమం కొనసాగడంతో ఆలయ పరిసరాలు, వీధులన్నీ కళకళలాడాయి. కాగా, ఆదివారం బోనాలు, సోమవారం రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు, పలహార బండ్ల ఊరేగింపుతో లష్కర్లో జాతర ముగిసింది.
