జూన్ 1 న తుదిదశ పోలింగ్... ఈ సారి ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారంటే.. ?

జూన్ 1 న తుదిదశ పోలింగ్... ఈ సారి ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారంటే.. ?

ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. చివరి దశ పోలింగ్ జూన్1 న జరగనుంది. ఈ దశ ఎన్నికలు ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. మొత్తం 57 లోక్‌‌సభ స్థానాల్లో 904 మంది అభ్యర్థులు  బరిలో ఉన్నారు.

ఏడో దశలో పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో ప్రధాని మోదీ బరిలో ఉన్న వారణాసి కూడా ఉంది. అంతే కాకుండా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, నటి కంగనా రనౌత్, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ తదితరులు పోటీ చేస్తున్నారు. శనివారం ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కేంద్రాలకు, భద్రతా సిబ్బందిని తరలించేందుకు ఎన్నికల సంఘం 13 ప్రత్యేక రైళ్లు, 8 హెలికాఫ్టర్లను రంగంలోకి దించింది.

ఉదయం7 గంటలకు ఓటింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఏడో విడత ఎన్నికల్లో భాగంగా పంజాబ్ లో 328 మంది, యూపీలో 144 మంది, బీహార్ 134, ఒడిశా 66, జార్ఖండ్ 52, హిమాచల్ ప్రదేవ్ 37, చండీగఢ్ లో 19 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఏడో విడత ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులో మొదటిది ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి. ఆయనకు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ బరిలో దిగారు. 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మోదీ మరోసారి విజయ కేతనం ఎగురవేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో నియోజకవర్గం హిమాచల్ ప్రదేశ్‌లోని మండి. ఇక్కడ బాలీవుడ్  నటి కంగనా రనౌత్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు.

మండి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ బరిలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో కాంగ్రెస్ అభ్యర్థి సత్యపాల్ సింగ్ తలపడుతున్నారు. అనురాగ్ ఠాకూర్ ఇక్కడ నుంచి ఇప్పటి వరకూ 3 సార్లు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు