- సీజన్ బెస్ట్ 89.49 మీటర్ల త్రో చేసిన చోప్రా
- లాసానె డైమండ్ లీగ్ మీట్‌లో రెండో స్థానం
లుసానె: పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచి జోరు మీదున్న ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా లాసానె డైమండ్ లీగ్ మీట్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఫిట్‌నెస్ సమస్యలు వెంటాడుతున్నప్పటికీ ఈ సీజన్ బెస్ట్ త్రో చేసి ఆకట్టుకున్నాడు. కానీ, టాప్ ప్లేస్ సాధించలేకపోయాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈవెంట్‌లో నీరజ్ తన చివరి ప్రయత్నంలో జావెలిన్‌ను 89.49 మీటర్ల దూరం విసిరి రెండో ప్లేస్ సాధించాడు.
రెండుసార్లు వరల్డ్ చాంపియన్, పారిస్ గేమ్స్ కాంస్య పతక విజేతగా అండర్సన్ పీటర్స్ (గ్రెనడా) 90.61 మీటర్ల త్రో చేసి టాప్ ప్లేస్ కైవసం చేసుకున్నాడు. జర్మనీకి చెందిన జులియన్ వెబర్ 87.08 మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్‌లో రెండో ప్లేస్‌లో నిలవడం ద్వారా నీరజ్ ఏడు పాయింట్లు అందుకున్నాడు. దాంతో డైమండ్ లీగ్ జావెలిన్ త్రో పట్టికలో 15 పాయింట్లతో వెబర్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. పీటర్స్ 21 పాయింట్లతో టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లాడు. 82.03 మీటర్లతో లాసానె మీట్‌లో ఏడో స్థానంతో సరిపెట్టిన చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకబ్ వడ్లెజ్ 16 పాయింట్లతో ఓవరాల్‌గా రెండో ప్లేస్‌లో ఉన్నాడు. సెప్టెంబర్ 5న జూరిచ్‌లో మరో డైమండ్ మీట్ జరగనుంది. ఓవరాల్‌గా టాప్–6లో నిలిచే త్రోయర్లు అదే నెల 14న బ్రస్సెల్స్‌లో జరిగే ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు.
తడబడి తేరుకొని..
గజ్జల్లో గాయం చాన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఈ లీగ్ బరిలో నిలిచిన 26 ఏండ్ల చోప్రా తడబడి తేరుకున్నాడు. క్రమంగా దూరాన్ని పెంచుతూ సీజన్ బెస్ట్ మార్కు అందుకున్నాడు. 82.10 మీటర్లతో పోటీని మొదలు పెట్టిన ఇండియా స్టార్ తర్వాతి రెండు ప్రయత్నాల్లో జావెలిన్‌ను వరుసగా 83.21, 83.13 మీటర్ల దూరం మాత్రమే పంపించగలిగాడు. నాలుగో ప్రయత్నంలో 82.34 మీటర్ల త్రో చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. ఐదు ప్రయత్నాల తర్వాత టాప్–-3లో నిలిచిన వారికి మాత్రమే చివరి, ఆరో త్రో చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో చోప్రా ఎలిమినేషన్ ప్రమాదంలో నిలిచాడు. కానీ, ఐదో ప్రయత్నంలో 85.58 మీటర్లు విసిరి ఎలిమినేషన్ తప్పించుకున్నాడు. తన శక్తిని ఆఖరి, అత్యుత్తమ త్రో కోసం కాపాడుకున్నాడు. ఆరో ప్రయత్నంలో జావెలిన్‌ను 89.49 మీటర్ల దూరం విసిరిన నీరజ్.. పారిస్ ఒలింపిక్స్‌లో చేసిన 89.45 మీటర్ల సీజన్ బెస్టు మార్కును అధిగమించాడు. మరోవైపు మొదటి త్రో నుంచి అగ్రస్థానంలో కొనసాగిన పీటర్స్ ఆరో ప్రయత్నంలో 90 మీటర్ల మార్కును అందుకొని టాపర్‌గా నిలిచాడు. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన పాకిస్తాన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఈ ఈవెంట్‌కు దూరంగా ఉన్నాడు.
సీజన్ బెస్ట్‌తో హ్యాపీ: చోప్రా
ఈ పోటీలో ఆరంభంలో తడబడినా.. చివరికి సీజన్ బెస్ట్ మార్కు అందుకున్నందుకు సంతోషంగా ఉన్నానని నీరజ్ చెప్పాడు. ‘ఆరంభంలో నేను సౌకర్యవంతంగా లేను. కానీ నా చివరి ప్రయత్నంలో సీజన్ బెస్ట్ త్రో చేసినందుకు హ్యాపీగా ఉన్నా. పుంజుకునే క్రమంలో నేను చూపించిన పోరాట స్ఫూర్తిని ఆస్వాదించాను. ఇలాంటి అత్యుత్తమ స్థాయి పోటీల్లో బరిలో ఉన్నప్పుడు మానసికంగా కఠినంగా ఉండి చివరి వరకూ పోరాడటం చాలా ముఖ్యం’ అని నీరజ్ చెప్పుకొచ్చాడు.