గండిపేట, వెలుగు: తన అక్కను వదిలేసి రెండో వివాహం చేసుకున్న బావను బామ్మర్ది అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అత్తాపూర్ సీఐ నాగేశ్వర్‌రావు తెలిపిన ప్రకారం.. అత్తాపూర్ సులేమాన్ నగర్‌లో నివసించే మహమ్మద్ ఖదీర్(36) జూనియర్ అడ్వకేట్, రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఎనిమిదేళ్ల క్రితం తాబస్సుమ్ ఫాతిమాతో ఖదీర్‌కు వివాహం జరిగింది. ఇటీవల విభేదాలు రావడంతో మరో మహిళ సిమ్రాన్‌ను రెండో వివాహం చేసుకున్నాడు.
దీంతో ఫాతిమా తమ్ముడు అనీఫ్ బావపై కోపం పెంచుకున్నాడు. శనివారం మధ్యాహ్నం సులేమాన్ నగర్‌లోని ఆఫీస్‌లో ఖదీర్ ఒంటరిగా ఉండగా అనీఫ్ నలుగురు వ్యక్తులతో అక్కడికి వెళ్లి కత్తితో కడుపులో పొడిచి హత్య చేశాడు. రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
