ప్రాణహిత భూములు కబ్జా చేసి పంటలు వేసిన లీడర్లు..భూములిచ్చిన రైతులేమో కూలి పనికి

ప్రాణహిత భూములు కబ్జా చేసి పంటలు వేసిన లీడర్లు..భూములిచ్చిన రైతులేమో కూలి పనికి
  •     భూములిచ్చిన రైతులేమో  కూలి పనికి
  •     చోద్యం చూస్తున్న  ఇరిగేషన్​ ఆఫీసర్లు

ప్రాణహిత ప్రాజెక్టు కింద  భూముల్ని కోల్పోయిన వందలాది రైతులు కూలీలుగా మారారు. కానీ కొంతమంది  లీడర్లు మాత్రం సేకరించిన  భూములను ఆక్రమించుకొని దర్జాగా పంటలు వేస్తున్నారు. చేపల చెరువులు తవ్వుకుని  రెండు చేతులా సంపాదిస్తున్నారు.

మంచిర్యాల, వెలుగు:  ప్రాణహిత ప్రాజెక్టు వస్తే తమ బతుకులు బాగుపడతయని విలువైన సాగు భూములను సర్కారోళ్లకు ఇచ్చిన సన్న, చిన్నకారు రైతులు రోడ్డున పడ్డరు. ఏండ్లు గడుస్తున్నా ప్రాజెక్టు రాకపోవడం, జీవనాధారమైన పంట భూములను కోల్పోవడంతో వందలాది రైతులు కౌలుదారులుగా, కూలీలుగా మారి దయనీయంగా బతుకుతున్నరు. కానీ కొంతమంది బడా రైతులు, లీడర్లు మాత్రం తమ పలుకుబడితో ప్రాణహిత కోసం ప్రభుత్వం సేకరించిన  భూములను ఆక్రమించుకొని దర్జాగా పంటలు తీస్తున్నరు. ప్రాజెక్టు కోసం తీసిన కాల్వలను చేపల చెరువులుగా మార్చి రెండు చేతులా సంపాదిస్తున్నరు.

రీ డిజైనింగ్​తో ప్రాణహితకు పాతర

కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని కౌటాల మండలం తుమ్మడిహెట్టి దగ్గర రూ. 35 వేల కోట్లతో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించాలని తలపెట్టారు. 2008లో అప్పటి సీఎం వైఎస్​రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. తుమ్మడిహెట్టి​ నుంచి చేవెళ్ల వరకు 1,055 కిలోమీటర్ల దూరం కెనాళ్లు, టన్నెళ్లు నిర్మించి 21 లిఫ్టుల ద్వారా 160 టీఎంసీల నీటిని తరలించాలనే లక్ష్యంతో  పనులు ప్రారంభించారు. మొత్తంగా16.40 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్​ సిటీకి తాగునీరు అందించేలా డిజైన్​చేశారు. ఈ పనులను 28 ప్యాకేజీలుగా విభజించి కాల్వల తవ్వకం చేపట్టారు.కానీ వైఎస్సార్​ చనిపోయాక పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ రీడిజైనింగ్​పేరిట ప్రాణహితకు పాతరేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన విషయం తెలిసిందే.

భూములు పాయె.. బతుకుదెరువు లేకపాయె

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలో 71.50 కిలోమీటర్ల కాల్వలు తవ్వారు. ఇందుకోసం 5,061 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. అప్పటి రేటు ప్రకారం ఎకరానికి రూ.1.20 లక్షల నుంచి రూ.1.25 లక్షల ధర నిర్ణయించి రైతులకు చెల్లించారు. కొంతమంది రైతులకు వివిధ కారణాలతో సగం పరిహారం మాత్రమే వచ్చింది. కొందరు రైతులు ధర తక్కువగా ఇస్తున్నారని ప్రభుత్వంపై కోర్టులో కేసు వేశారు. ఆ కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. వ్యవసాయం తప్ప మరే పనీ తెలియని రైతులు అటు ఉన్న భూమిని కోల్పోయి..  ఇటు ప్రాజెక్టు రాక కూలీలుగా మిగిలిపోయారు.

భూముల్లో పంటలు.. కాల్వల్లో చేపలు

పడావుగా ఉంటున్న ప్రాణహిత భూములను కొందరు లీడర్లు, బడా రైతులు ఎకరాల కొద్దీ ఆక్రమించుకొని పత్తి సాగు చేస్తున్నారు. కాల్వల్లో చేపలు, రొయ్యలు పెంచుతూ లాభపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా వేమనపల్లి మండలం జిల్లెడకు చెందిన కొంతమంది రూలింగ్​ పార్టీ లీడర్లపై స్థానికులు కలెక్టర్​కు కంప్లైట్​ చేశారు. కలెక్టర్​ఆర్డర్స్​మేరకు రెవెన్యూ ఆఫీసర్లు సర్వే చేసి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆధీనంలో 60 ఎకరాలకు పైగా భూమి ఉన్నట్లు గుర్తించారు. వీరు కాల్వల్లో అక్రమంగా చేపల పెంపకం చేపట్టడమే కాకుండా ఆ పక్కనే కుంటలు తవ్వి చేపలు, రొయ్యలు పెంచుతున్నట్లు నిర్ధారించారు. తహసీల్దార్​ మధుసూదన్​ కంప్లైంట్​తో వారిపై నీల్వాయి పోలీసు స్టేషన్​లో క్రిమినల్​ కేసు నమోదు చేశారు. సదరు గులాబీ లీడర్లకు ఓ ప్రజాప్రతినిధి అండ ఉండడంతో ఇంతవరకు ఎలాంటి యాక్షన్​ తీసుకోలేదు. ఇరిగేషన్​ ఆఫీసర్లు మాత్రం ప్రాణహిత భూములు ప్రభుత్వానివే అని, చేస్తే చర్యలు తప్పవని పేర్కొంటున్నారు.

ప్రాజెక్టు కడ్తరా…భూములు ఇస్తరా?

ప్రాణహిత ప్రాజెక్టు పేరిట మోసపోయిన సన్న, చిన్నకారు రైతులు ‘ఇప్పటికైనా ప్రాజెక్టు కడ్తరా? లేక మా భూములు మాకు ఇస్తరా?’ అని సర్కారును ప్రశ్నిస్తున్నారు. కొంత భూమి ప్రాజెక్టులో పోయినా మిగిలిన భూమికి నీళ్లొస్తాయని, తోటి రైతులతోపాటు ఈ ప్రాంతం డెవలప్​ అవుతుందనే ఆశతో భూములు ఇస్తే… సీఎం కేసీఆర్​ ప్రాణహితను పక్కనపెట్టి తమను నిలువునా ముంచాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.