బరిలో భార్యలను నిలిపి.. ప్రచారంలో భర్తల హామీలు

బరిలో భార్యలను నిలిపి.. ప్రచారంలో భర్తల హామీలు

నిన్న, మొన్నటి వరకు ఏదోక పదవిలో ఉన్న నేతలకు నేడు మున్సిపల్ రిజర్వేషన్లు కలిసిరాలేదు. అయితేనేం.. పవర్ కోసం, హోదా కోసం భార్యలను రంగంలోకి దింపారు. పోటీలో ఉన్నది భార్యలైనా అన్నీతామై వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ప్రచారంలో తిరగడం మొదలు తెర వెనుక హామీల వరకూ వారే చూసుకుంటున్నారు. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ మున్సిపల్ బరిలో దాదాపు 600 మంది మహిళలు ఉన్నారు. ప్రచారానికి మరో మూడ్రోజులే ఉండడంతో చైర్మన్‌, మేయర్‌ పదవులను ఆశిస్తున్న వారు భార్యల గెలుపు కోసం కంటి మీద కునుకు లేకుండా ప్రచారం చేస్తున్నారు. జనరల్‌ మహిళ రిజర్వేషన్‌ ఉన్న 11 మున్సిపాలిటీల్లో పోటీ తీవ్రంగా ఉంది.

రంగారెడ్డి జిల్లా, వెలుగు:

మాజీ ప్రజా ప్రతినిధులు కొందరికి మున్సిపాలిటీ రిజర్వేషన్లు అనుకూలించలేదు. దీంతో భార్యలను బరిలో నిలిపి వారి గెలుపునకు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.  ఎలాగైనా గెలువాల్సిందేనన్న పట్టుదలతో  వారున్నారు.   వారిని గెలిపిస్తేనే… తమకు హోదా ఉంటుందని భర్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. భార్యలు ప్రజాప్రతినిధులైతేనే పార్టీలో, ప్రజలపై పెత్తనం చెలాయించే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం కోసం భర్తలు కాచుకుని కూర్చున్నారు. మరికొందరూ మా ఇంటిలోనే పదవులు ఉండాలనే దోరణితో    వ్యవహరిస్తున్నారు. పార్టీలో క్రియశీల కార్యకర్తగా, నామినేటెడ్‌‌ పదవులను అనుభవిస్తున్న నేతలు సైతం భార్యలను బరిలో నిలిపారు. ఈవిధంగా రంగారెడ్డి, మేడ్చల్‌‌, వికారాబాద్‌‌ జిల్లాలోని మున్సిపాలిటీల్లో మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు సాగిస్తున్న వైఖరి. ఇందులో అత్యధికులు టీఆర్ఎస్‌‌ నేతలే ఉన్నారు.

బరిలో 600 మంది మహిళలు

మూడు జిల్లాల కార్పొరేషన్‌‌, మున్సిపాలిటీలు కలిపి 32 ఉన్నాయి. వీటిలో 14 మున్సిపాలిటీల చైర్మన్‌‌, మేయర్‌‌ రిజర్వేషన్‌‌ మహిళాలకు కేటాయించారు. అదేవిధంగా 737 వార్డుల్లో 312 మహిళా రిజర్వేషన్ల అయ్యాయి. ఈ మహిళా రిజర్వేషన్లలో సుమారుగా 600 మంది మహిళలు పోటీలో ఉన్నారు. వీరి  గెలుపు కోసం వారి భర్తలు  ప్రణాళికలు, ఎత్తుగడలు వేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్‌‌ ఉన్న స్ధానాల్లో పెద్దగా పోటీ కనిపించడం లేదు. కానీ జనరల్‌‌ మహిళా రిజర్వేషన్‌‌ ఉన్న 11 మున్సిపాలిటీల చైర్మన్లకు, వార్డులకు తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. ఈ స్థానాల్లో పదవులు దక్కించుకోవాలని యోచిస్తున్న నాయకులు గతంలో అనేక పదవులు ఆశించారు. సర్పంచ్‌‌, ఉప-సర్పంచ్‌‌, మార్కెటింగ్‌‌ చైర్మన్‌‌, ఎంపీపీ పదవులను అనుభవించారు. ఈ దఫా పదవులు లభించకపోవడంతో భార్యల పేరుతో పదవులు దక్కించుకోవాలని యోచిస్తున్నారు.

సమయం తక్కువగా ఉండడం

భార్యల కోసం భర్తలు ఆరాటం ప్రచారంలో కనిపిస్తోంది. తమ జీవిత భాగస్వాముల గెలుపునకు విశ్రమించకుండా శ్రమిస్తున్నారు. ప్రచారానికి సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎలాగైన చైర్మన్‌‌, మేయర్‌‌ పదవులను దక్కించుకోవాలని తాపత్రాయ పడుతున్నారు. పట్టణాల్లోని ప్రతి వార్డు సభ్యుల గెలుపుతో పాటు తమ భార్య గెలుపు బాధ్యతను బుజాలపై వేసుకుంటున్నారు.  ఓట్లను తమవైపు మళ్లించుకోవడం అంతా సులువైన పని కాదని భర్తలకు తెలుసు.. ఎందుకంటే భర్తలు ప్రచారంలో చొచ్చుకొని ఏవి ధంగా ఓటు అభ్యర్ధించాలనే పూర్వఅనుభవం ఉంది.  కానీ ప్రచారం చేసేందుకు సమయం తక్కువగా ఉండడం వారిని ఆందోళన కలిగిస్తున్నది.

ఈ మున్సిపాలిటీల్లోనే పోటీ

బడంగ్‌‌పేట్‌‌, జవహర్‌‌నగర్‌‌, నిజాంపేట్‌‌, పెద్దఅంబర్‌‌పేట్‌‌, తుర్కయంజాల్‌‌, శంషాబాద్‌‌, శంకర్‌‌పల్లి, ఘట్‌‌కేసర్‌‌, గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌‌, దుండిగల్ తాండూర్‌‌, వికారాబాద్‌‌ మున్సిపాలిటీలో మాజీ ప్రజాప్రతినిధులు తమ సత్తా చాటుకునేందుకు భార్యలను రంగంలోకి దించారు.

ఈ మున్సిపాలిటీల్లో…

పెద్ద అంబర్‌‌పేట్‌‌ మున్సిపాలిటీలో భార్య గెలుపు కోసం మాజీ నగర పంచాయతీ చైర్మన్‌‌ బలరాం కృషి చేస్తున్నారు. మొదటి సారి జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో రిజర్వేషన్‌‌ ఎస్సీ మహిళ కావడంతో భార్యను బరిలో నిలిపారు. దీంతో తిరిగి చైర్మన్‌‌ పదవిని దక్కించుకోవాలని ప్రయత్నలు చేస్తున్నారు.

తుర్క యంజాల్‌‌ మున్సిపాలిటీ చైర్మన్‌‌ పదవిని దక్కించుకునేందకు మాజీ ఎంపీపీ,  మల్‌‌రెడ్డి రంగారెడ్డి తమ్ముడు రాంరెడ్డి భార్యను బరిలోకి దింపారు. మున్సిపాలిటీ చైర్మన్‌‌ జనరల్‌‌ మహిళ రిజర్వేషన్‌‌తో  రాంరెడ్డి భార్య అనురాధ రెడ్డి గెలుపునకు కృషి చేస్తున్నారు.

శంకర్‌‌పల్లి మున్సిపాలిటీ చైర్మన్‌‌ రేసులో టీఆర్‌‌ఎస్‌‌ పార్టీ మండలాధ్యక్షుడు, గుడిమల్కాపూర్‌‌ మార్కెటింగ్‌‌ చైర్మన్‌‌ డి.వెంకట్‌‌రెడ్డి భార్యను బరిలోకి దింపారు. శంకర్‌‌పల్లి మున్సిపాలిటీ చైర్మన్‌‌ పదవి జనరల్‌‌ మహిళా రిజర్వేషన్‌‌ కావడంతో పోటీకి సై అంటున్నారు. చైర్మన్‌‌ దక్కించుకోవాలని వెంకట్‌‌రెడ్డి భార్య  అనురాధ గెలుపునకు కృషి చేస్తున్నారు. ఇదే మున్సిపాలిటీలో మాజీ ఉప-సర్పంచ్‌‌ సాట ప్రవీణ్‌‌ కుమార్‌‌ భార్య విజయలక్ష్మి చైర్మన్‌‌ రేసులో ఉన్నారు. ఈమె గెలుపునకు భర్త ప్రవీణ్ కుమార్‌‌ విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు.

శంషాబాద్‌‌ మున్సిపాలిటీలో చైర్మన్‌‌ దక్కించుకోవాలని మాజీ సర్పంచ్‌‌, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన గణేశ్​ గుప్త భార్య రేఖా గుప్తాను రంగంలోకి దించారు. ఈ మున్సిపాలిటీ జనరల్‌‌ మహిళ కావడంతో భార్య గెలుపునకు అష్టాకష్టాలు పడుతున్నారు.

ఘట్‌‌కేసర్‌‌ మున్సిపాలిటీలో చైర్మన్‌‌ కోసం  మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్‌‌ గౌడ్‌‌ భార్య వసంత పోటీలో ఉన్నారు. బండారి వసంత గెలుపు కోసం భర్త ప్రణాళికలు చేస్తున్నారు.

జవహర్‌‌ నగర్‌‌ మున్సిపాలిటీ చైర్మన్‌‌ బీసీ మహిళ కావడంతో మేకల అయ్యప్ప కూతురు కావ్యని బరిలోకి దింపారు. అయ్యప్ప టీఆర్ఎస్‌‌ జిల్లా నాయకుడు, రిజర్వేషన్‌‌ అనుకూలంగా లేకపోవడంతో కూతురును బరిలో నిలిపి  ప్రయత్నాలు సాగిస్తున్నారు.

More News: సెన్సిటివ్ గా ఉండటం అంటే..

అమ్మాయిలు మనోళ్లే.. ఆడేది అమెరికా లీగ్ లో!

Leaders who are struggling for their wives who are in Municipal election competition