డాసన్... ఇక్కడ బంగారం దొరుకున్!

డాసన్... ఇక్కడ బంగారం దొరుకున్!

అది కెనడాలో ఒక చిన్న ఊరు. ఆ ఊళ్లో ఉన్న కొండలు, నది ప్రకృతి అందాలతోపాటు.. ఇంకా ఎంతో స్పెషల్​ ఉంది. కొండను తవ్వితే బంగారం బయటపడుతుంది! నదీ ప్రవాహాన్ని చూస్తుంటే మెరిసే బంగారం నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంది. అలా ఆ కొండల్ని తవ్వి గోల్డ్ తీసుకెళ్లేవాళ్లు కొందరైతే, పక్కనే పారుతున్న నదిలో కొట్టుకొస్తున్న బంగారు రేణువుల్ని జల్లెడ పట్టేవాళ్లు మరికొందరు. అక్కడి వాళ్లకు నీటిలో చేపలు పట్టడం కష్టమేమోగానీ, బంగారాన్ని పట్టుకోవడం చాలా ఈజీ. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పడు ఆ ఊళ్లో గోల్డ్ మైనింగ్ లీగల్​. అంతగా బంగారం దొరికే ఊరు ఎక్కడ? వెళ్లొద్దాం అనుకుంటున్నారా! ఆ విశేషాలు ఇవి... యూకాన్​ నది ఒడ్డున ఉంది డాసన్​ సిటీ. ఈ సిటీ పేరు చెప్పగానే అక్కడి వాళ్లలో చాలామందికి గోల్డ్ రష్ గుర్తొస్తుంది. దీనికి పెద్ద చరిత్రే ఉంది. దాని గురించి బ్రీఫ్​గా చెప్పాలంటే.. బంగారాన్ని తవ్వుకునేందుకు చాలామంది గుంపుగా అక్కడికి వెళ్లారు. ఈ సిటీ కెనడాలోని యూకాన్​లో రాష్ట్రంలోని క్లొండైక్​లో ఉంది. 

యూకాన్ రాజధానిగా..

యూకాన్​లో రెండో అది పెద్ద నగరం డాసన్. ఇక్కడ గొప్ప చరిత్రతోపాటు కళలు, కళాకారులు, కల్చర్, నేచర్​... ఇలా ప్రతి అంశం చెప్పుకోదగ్గదే.1898 నుంచి1952 వరకు యూకాన్ రాజధానిగా డాసన్ ఉంది. ఆ తర్వాత వైట్​ హార్స్​ రాజధాని అయింది. డాసన్​ సిటీ టింటినా ఫాల్ట్​పై ఉంది. అక్కడ ఒక కాలువ ఏర్పడి, అక్కడి నుంచి తూర్పు దిశగా కొన్ని వందల కిలో మీటర్లు ప్రవహించింది. అలాంటిది లావా ప్రవాహం వల్ల అంత పొడవైన డాసన్​ సిటీ కాస్తా కోతకు గురైంది. 

గోల్డ్ రష్

ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన ‘క్లొండైక్​ గోల్డ్ రష్​’ జరిగింది డాసన్​ సిటీలోనే.1887లో యూకాన్​కు చెందిన కెనడాలోని జియాలజిస్ట్ జార్జ్ మెర్సెర్​ డాసన్ క్లొండైక్​ వాగులో బంగారాన్ని కనిపెట్టాడు. ఆ తర్వాత దీనికి జార్జ్ మెర్సెర్​ డాసన్ అనే పేరు వచ్చింది. ఇక్కడ బంగారాన్ని కనుగొన్నాక, అలాస్కా సరిహద్దులో సర్వే చేయాలనే పేరుతో యూకాన్ నది దగ్గర అన్వేషణ మొదలుపెట్టాడు. డాసన్​లో ప్రస్తుతం ప్రజలు నివసిస్తున్న ప్రాంతాన్ని మాత్రం జోసెఫ్ లాడ్యు అనే బిజినెస్ మ్యాన్ కనిపెట్టాడు. 

క్లొండైక్ గోల్డ్ రష్​

ఎటు చూసినా బంగారం! లక్షమంది జనం.. అందరూ మైనింగ్ చేసేవాళ్లే. ఆ బంగారం కోసం అలాస్కా, యూకాన్​ ప్రాంతాలకు వెళ్లారు.1899లో చాలామంది మైనింగ్ చేసేవాళ్లు అలాస్కాలో బంగారం కోసం వెతుకులాట మొదలుపెట్టారు. దాంతో ‘క్లొండైక్​ గోల్డ్ రష్’​ అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఇప్పుడు కేవలం19వ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద సాహసంగా జ్ఞాపకాల్లో మిగిలిపోయింది గోల్డ్ రష్​. 

అంతకుముందు ఏం జరిగింది? 

అది ఆగస్ట్ నెల.1896వ సంవత్సరం. స్కూకుమ్ జిమ్ అనే అతను, తన కుటుంబంతో కలిసి కెనడాలోని యూకాన్​ టెరిటరీలో ఉన్న క్లొండైక్ నది దగ్గరకి బంగారం వేటకు బయలుదేరాడు. వాళ్ల డిస్కవరీ గోల్డ్ రష్​ హిస్టరీలోనే చెప్పుకోదగ్గది. వీళ్ల బంగారం వేట గురించి తెలిసి ఆ నదికి దగ్గర్లో ఉన్న ప్రజలు కొందరు మైనర్లు గుంపులుగా వచ్చి వీళ్లతో కలిశారు. ఒక ఏడాది తర్వాత ఈ వార్త ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. తీర ప్రాంతాల్లో ఉండేవాళ్లు షిప్పుల్లో బంగారం వేటకు వెళ్లేవాళ్లు. దొరికిన బంగారాన్ని తీసుకెళ్లి అమ్ముకునేవాళ్లు. 

మొదటి ఏడాది గోల్డ్​ రష్​లో పాల్గొన్నవాళ్లు దాదాపు 20 నుంచి 30 వేల మంది అనేది అంచనా. వాళ్లంతా మూడు నెలల పాటు నది ఒడ్డున ఉన్నారని... అక్కడి నుంచి బంగారం కోసం 35 మైళ్లు నీటిలో నడిచారని చెప్తారు. కొందరు బోట్​లు తయారుచేసుకుని చాలా మైళ్లు ప్రయాణించేవారట. అలా వాళ్లు డాసన్ సిటీ చేరుకున్నారు. క్లొండైక్​ జిల్లాలో ఉన్న ఆ ఊళ్లో బంగారం మైనింగ్ జరిగింది. అక్కడి నుంచి బంగారు ముద్దలను సప్లై చేశారు.1898 వేసవి కాలం మధ్యలో18 వేల మంది ప్రజలు డాసన్​ సిటీలో ఉన్నారు. అందులో ఐదువేల మంది ప్రజలు బంగారం తవ్వకాల్లో పనిచేశారు. ఆగస్ట్​లో చాలామంది బంగారం వేటగాళ్లు అక్కడే ఇండ్లు కట్టుకున్నారు. 

అక్కడికి ఎలా వెళ్లారు? 

బంగారం వేటకు బయలుదేరిన వాళ్లు క్లొండైక్​కు రకరకాల దారులు కనిపెట్టారు. అప్పుడు తొక్కిసలాటలు కూడా జరిగాయి. కొందరు నీటిమార్గాన్ని ఎంచుకున్నారు. దాన్ని రిచ్​ మ్యాన్​ రూట్ అని పిలిచేవాళ్లు. అలాస్కా చుట్టుపక్కల పడవ ప్రయాణం చేస్తే యూకాన్​ నదికి చేరుకోవడం చాలా ఈజీ అనేవాళ్లు. కాకపోతే అది కాస్త ఖర్చు ఎక్కువ. అలాగే కొంతమంది నడుచుకుంటూ వెళ్లేవాళ్లు. దారిలో చాలామంది తప్పిపోయారు. కొందరు మంచు వల్ల గుడ్డివాళ్లయ్యారు. మరి కొంతమంది చనిపోయారు. ఈ మార్గాలను ఎంచుకున్నవారిలో మరి కొందరు క్లొండైక్​కు చేరుకోవడానికి రెండేండ్లు పట్టింది. చాలామంది డైరెక్ట్​గా వెళ్లేలా, చౌకైన మార్గాలను ఎంచుకున్నారు. దీన్ని పేదవారి మార్గం అని పిలిచేవాళ్లు. ఈ ‘పేదవారి’ మార్గంలో యూకాన్ నది పైకి చేరుకోవడానికి కోస్ట్ రేంజ్ పర్వతాల మీదుగా వెళ్లారు. స్టాంపెడర్లు బంగారం వేట కోసం ఇంట్లో తయారుచేసిన పడవలో 500 మైళ్లకు పైగా ప్రయాణించారు.1897–98 మధ్య కాలంలో బంగారాన్ని అలాస్కాలో ఉన్న స్కాగ్వే, డయా ప్రాంతాలకు షిప్పుల్లో తీసుకెళ్లి అమ్మేవాళ్లు. దాంతో కొన్ని నెలల్లోనే బంగారం అమ్మే స్టాల్స్ చాలా పుట్టుకొచ్చాయి. వ్యాపారులు బీచ్ వెంబడి రెండు మైళ్ల వరకు రేవు ఏర్పాటు చేసుకుని డబ్బులు సంపాదించారు. కానీ, ఈ వేటలో హత్యలు, ఆత్మహత్యలు, రోగాలు, పోషకాహార లోపాలు, హార్ట్​ ఎటాక్​లు, హైపోథర్మియా వల్ల చనిపోవడం... ఇలా ఎన్నో దురదృష్టకర ఘటనలు చోటుచేసుకున్నాయి. అందులోనూ చిలుకూట్ ట్రయల్ వెళ్లేటప్పుడు ఇనుప కమ్మలు వేసిన రైలు పట్టాల్లాంటి మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. ఈ మార్గంలో వాళ్లు వస్తువులు, బట్టలు బ్యాగ్​లో వేసుకుని, భుజాన మోసుకుంటూ వెళ్లేవాళ్లు. వైట్ పాస్​ ట్రయల్​ మార్గంలో జంతువులు తిరుగుతుంటాయి. ఎవరైనా అక్కడ ఆగిపోతే జంతువులకు చిక్కడం ఖాయం. అదృష్టం ఉన్నవాళ్లే క్షేమంగా ఉండేవాళ్లు. అయితే ఈ దారిలో మూడు వేలకు పైగా జంతువులు కూడా మరణించాయి. వాటి ఆనవాళ్లు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి! 

డైమండ్ టూత్ గెర్టీస్ గ్యాంబ్లింగ్ హాల్

ఇది కెనడాలోని మొదటి క్యాసినో. ఇక్కడ ప్రత్యేకమైన స్టైల్​లో డాన్స్​లు చేస్తారు. ఆ డాన్స్​లు చూసేందుకు చాలామంది వస్తుంటారు. దీన్ని క్లొండైక్ విజిటర్స్ అసోసియేషన్ నడుపుతోంది. ఇక్కడ క్యాసినో గేమ్స్, నాస్టాలజిక్ ట్యూన్స్, మూడు రకాల కన్​కన్ ఇన్​స్పైరింగ్​ షోలు ప్రదర్శిస్తారు. ‘గోల్డ్ రష్ గర్ల్స్’ అని పిలిచే కొందరు అమ్మాయిలు ప్రేక్షకులు కూర్చున్న దగ్గరకు వచ్చి మరీ డాన్స్​లు చేస్తారు. ఇలా దాదాపు రెండు లేదా మూడు గంటలు ఇక్కడ ఎంజాయ్​ చేయొచ్చు. మే నుంచి సెప్టెంబర్​ మధ్యలో మాత్రమే ఈ హాల్ తెరిచి ఉంటుంది. వారంలో ఎప్పుడైనా వెళ్లొచ్చు ఇక్కడికి. మిగతా నెలల్లో కొన్ని వీకెండ్స్​ మాత్రమే తెరుస్తారు. అయితే, ఇక్కడ పందొమ్మిదేండ్లు నిండిన వాళ్లే వెళ్లాలి. అది కూడా సరైన ఐడెంటిటీ కార్డ్ చూపిస్తేనే లోపలికి ఎంట్రీ. ఈ ఊళ్లో సిటీ మ్యూజియం ఒకటి ఉంది. ఇందులో డాసన్​ సిటీ హిస్టరీకి చెందిన డాక్యుమెంట్స్, గోల్డ్ రష్​ గురించి వివరాలు ఉంటాయి. ఒక గంట బోట్ జర్నీ కూడా చేయొచ్చు. ఈ బోట్ జర్నీ చాలా స్పెషల్. ఎందుకంటే ఈ బోట్ కాస్త వెరైటీగా ఉంటుంది. దీన్ని  జార్జ్​ బ్లాక్ ఫెర్రీ అంటారు. బోటింగ్​తో పాటు హైకింగ్, ఫుడ్ వంటివెన్నో ఎంజాయ్ చేయొచ్చు.