ఆ కిరాతకుల్ని ప్రజలకే వదిలేయండి: ఎంపీ

ఆ కిరాతకుల్ని ప్రజలకే వదిలేయండి: ఎంపీ

దిశ అత్యాచారం ఘటనపై దేశప్రజలు..  ప్రభుత్వం నుంచి ఓ స్పష్టమైన తీర్పు కోరుతున్నారని రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్ అన్నారు. మీరు భద్రత కల్పించలేకపోతే ఆ ఘటనపై తీర్పును ప్రజల నిర్ణయానికే వదిలేయండని ప్రభుత్వ వైఫల్యం గురించి ప్రస్తావించారు. ప్రజల చేత నిందితులను చిత్రవధ చేయించి చంపాలన్నారు.

రాజ్యసభలో సోమవారం దిశ హత్య ఘటనపై చర్చ జరిగింది. ఈ చర్చలో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మాట్లాడుతూ.. ఓ మహిళపై దారుణంగా అత్యాచారానికి పాల్పడి, అత్యంత పాశవికంగా హత్య చేసిన వారిని  కఠినంగా శిక్షించాలన్నారు. ఎటువంటి క్షమాభిక్ష లేకుండా నిందితులను ప్రజల్లోకి తీసుకొచ్చి.. దాడి చేసి చంపాలన్నారు . నిర్భయ, కథువా, దిశ.. ఇలాంటి కేసుల్లో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారని ఆమె అన్నారు.

మరో ఎంపీ సోనాల్ మాన్సింగ్ మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతుండటం పట్ల తీవ్ర నిరాశకు లోనయ్యానన్నారు. దిశ ఘటన తనను షాక్ కు గురి చేసిందని, ఈ కేసు గురించి తెలుసుకొని సిగ్గుపడుతున్నానన్నారు.  ఇలా జరిగిన ప్రతిసారీ కొవ్వొత్తులతో నివాళులు, ర్యాలీలు.. తప్ప ప్రభుత్వం చేసిన చర్యలేంటని ప్రశ్నించారు.