కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ పేరు ఉపసంహరించుకోవాలి..నిరసన కార్యక్రమాలకు లెఫ్ట్ పార్టీల పిలుపు

కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ పేరు ఉపసంహరించుకోవాలి..నిరసన కార్యక్రమాలకు లెఫ్ట్ పార్టీల పిలుపు

హైదరాబాద్, వెలుగు: సిటీలోని అమెరికన్ కాన్సులేట్ వద్ద ఉన్న ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు మీదుగా ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా పేరు పెట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లెఫ్ట్ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశాయి. ప్రపంచ దేశాల సంపదను కొల్లగొట్టడానికి, సామ్రాజ్యవాద అహంకారంతో అమెరికా ఇతర దేశాలపై యుద్ధాలను రుద్దుతోందని లెఫ్ట్ పార్టీల నేతలు విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న విధానాలను తాము వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు.

భారత్‌‌‌‌పై ట్రంప్ విధించిన ఆర్థిక ఆంక్షలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయని, దీనికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా సహకరించడం వల్ల దేశం తీవ్రంగా నష్టపోయిందని వారు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 22న బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌లోని బాబూ జగ్జీవన్‌‌‌‌రాం విగ్రహం నుంచి ట్యాంక్‌‌‌‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు జరిగే నిరసన ప్రదర్శనలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.