అమీషా పటేల్‌కు షాక్.. మొరాదాబాద్ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ!

అమీషా పటేల్‌కు షాక్.. మొరాదాబాద్ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ!

బాలీవుడ్ నటి అమీషా పటేల్ మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఇది ఏడేళ్లనాటి ఒక పాత వివాదం కేసు. గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ కేసు విచారణ సందర్భంగా ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ కోర్టు ఆమెపై సీరియస్ అయింది. సుదీర్గ వాదనల తర్వాత ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇప్పుడు ఇది సినీ వర్గాల్లో సంచలనంగా మారింది.

అసలేం జరిగింది? 

ఈ వివాదం 2017 నాటిది. మొరాదాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త ఆయుష్ అగర్వాల్ కుటుంబంలో జరిగిన ఒక వివాహ వేడుకలో ప్రదర్శన ఇచ్చేందుకు అమీషా పటేల్‌తో ఒప్పందం కుదిరింది. ఈవెంట్ మేనేజర్ పవన్ కుమార్ వర్మ ద్వారా ఈ డీల్ జరిగింది.  ప్రదర్శన కోసం అమీషాకు రూ. 14.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారు.  ఆమె బస కోసం ఢిల్లీ రోడ్డులోని ఒక విలాసవంతమైన హోటల్‌లో గదులు కూడా బుక్ చేశారు. అయితే, ఒప్పందం ప్రకారం అమీషా ఆ వేడుకకు హాజరు కాలేదు. దీంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తరువాత జరిగిన చర్చల్లో, తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తానని అమీషా హామీ ఇచ్చారు. అయితే, కేవలం రూ. 10 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చారని, మిగిలిన రూ. 4.50 లక్షల కోసం ఇచ్చిన చెక్కు బ్యాంకులో బౌన్స్ అయిందని పవన్ వర్మ కోర్టును ఆశ్రయించారు.

కోర్టు ఆగ్రహం.. పదే పదే గైర్హాజరు!

ఈ కేసులో విచారణకు హాజరు కావాలని అదనపు సివిల్ జడ్జి కోర్టు అమీషాకు పలుమార్లు సమన్లు జారీ చేసింది. అయినప్పటికీ ఆమె కోర్టు ముందు హాజరు కాకపోవడంతో, న్యాయస్థానం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. దీంతో తాజాగా ఆమెకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

అమీషా క్లారిటీ..

ఈ వివాదంపై అమీషా పటేల్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. పవన్ వర్మ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆమె కొట్టిపారేశారు. ఈ వివాదం ఎప్పుడో పరిష్కారమైంది. సెటిల్‌మెంట్ డీడ్‌పై పవన్ వర్మ సంతకం కూడా చేశారు. ఒప్పందం ప్రకారం నేను నగదు చెల్లించాను. ఇప్పుడు కావాలనే తప్పుడు ఆరోపణలతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నా న్యాయవాదులు అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోబోతున్నారు అని ఆమె పేర్కొన్నారు.

మళ్లీ రిఎంట్రీ..

'కహో నా ప్యార్ హై'తో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన అమీషా, 'గదర్' సినిమాతో బాలీవుడ్ హిస్టరీలోనే అతిపెద్ద హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. మధ్యలో ఆఫర్లు తగ్గి వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ, ఇటీవల విడుదలైన 'గదర్ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడంతో ఆమె మళ్ళీ లైమ్‌లైట్‌లోకి వచ్చారు. గతంలో కూడా రాంచీ కోర్టులో చెక్ బౌన్స్ కేసు ఎదుర్కొన్న అమీషాకు, ఈ కొత్త వారెంట్ మరో తలనొప్పిగా మారింది. న్యాయస్థానం వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో, అమీషా పటేల్ తదుపరి విచారణకు హాజరవుతారా లేక ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.