గ్రామంలోకి చిరుత..పరుగో పరుగు

గ్రామంలోకి చిరుత..పరుగో పరుగు

అడవిలో ఉండాల్సిన ఓ చిరుతపులి జనాల్లోకి వచ్చి నానా హంగామా సృష్టించింది. చీకటి పడుతున్న సమయంలో గ్రామంలోకి చొరబడిన  చిరుత చౌరస్తాలో ప్రత్యక్షమవడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని కోపర్గావ్లో చోటు చేసుకుంది. 

 మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా కోపర్ గావ్ పట్టణంలో అక్టోబర్ 16వ తేదీన  రాత్రి చిరుత ప్రత్యక్షమైంది.  జనం తమ పనిలో ఉండగా..చిరుత ఎలాంటి భయం లేకుండా నివాస ప్రాంతాల్లోకి వచ్చింది. చిరుతను చూసిన స్థానికులు ఒక్కసారిగా భయపడ్డారు.  దాన్ని వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో చిరుత  ఒక వృద్ధుడిపై దాడి చేసింది.  దీంతో స్థానికులు వల సహాయంతో చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ చిరుత చిక్కలేదు. చిరుతను చూసిన కొందరు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. 

చిరుత సంచారంలో స్థానికులు మొదట దానిపై రాళ్లు రువ్వారు. దీంతో ఆగ్రహించిన చిరుతు ఇద్దరు వ్యక్తులపై దాడి చేసింది. ఈ సమాచారాన్ని తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ..తప్పించుకున్న చిరుత కోసం గాలిస్తున్నారు. బస్టాండ్ సమీపంలోని అడవిలో చిరుతపులి కోసం వలలు ఏర్పాటు చేశారు.