మద్యం అమ్మకాలు.. రూ.55 కోట్లు పెరిగిన ఆదాయం

మద్యం అమ్మకాలు.. రూ.55 కోట్లు పెరిగిన ఆదాయం

హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలు ముంచెత్తి, వరదలు పోటెత్తినా మద్యం అమ్మకాలు ఎక్కడా తగ్గలేదు. జులైలో మద్యంపై సర్కారుకు భారీగానే ఆదాయం సమకూరింది. వరదల ప్రభావం లేకపోతే లిక్కర్ ఆదాయం మరింతగా పెరిగేదని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. అయితే, నిరుటి జులై నెల ఇన్ కంతో పోలిస్తే ఈ ఏడాది జులైలో సేల్స్ భారీగానే పెరిగాయని తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లెక్కలు చెబుతున్నాయి. 2021 జులైలో రూ.2,419.56 కోట్ల లిక్కర్ సేల్స్ జరగ్గా, ఈ జులైలో 2,474.64 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. అంటే ఈ ఏడాది జులైలో లిక్కర్ ఇన్ కం రూ. 55 కోట్ల మేరకు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారిన లిక్కర్ సేల్స్ లో ఎప్పట్లాగే రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఐఎంఎల్ కేస్ లు, బీర్ కేస్ ల విక్రయాల్లో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, హనుమకొండ, మెదక్, కరీంనగర్ జిల్లాలు మొదటి ఆరు స్థానాల్లో ఉన్నాయి. నిరుడు జులైలో రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. 2021లో అతి తక్కువగా నాగర్ కర్నూల్ జిల్లాలో జులై నెలంతా రూ.51 లక్షల మద్యం అమ్ముడైతే దాని తర్వాతి స్థానంలో రూ. 79 లక్షలతో వికారాబాద్ ఉంది. ఈ జులైలో రూ.41 లక్షల సేల్స్ తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చివరి స్థానంలో, రూ.86 లక్షల ఆదాయంతో రాజన్న సిరిసిల్ల జిల్లా చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.  

ఐఎంల్, బీర్ల అమ్మకాలు ఇలా..  
నిరుడు జులైలో రాష్ట్రవ్యాప్తంగా 29,80,911 ఐఎంల్ కేసులు, 24,21,098 బీర్ల కేసులు అమ్ముడయ్యాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 6,72,042 ఐఎంఎల్ కేసులు, 5,77,243 బీర్ల కేసులు సేల్ అయ్యాయి. నిరుడు రంగారెడ్డి జిల్లా నుంచి రూ. 569.19 కోట్లు, హైదరాబాద్ నుంచి రూ. 262.43 కోట్లు, నల్గొండ నుంచి రూ. 258.69 కోట్ల మేర సర్కారుకు లిక్కర్ ఇన్ కం వచ్చింది. ఇక ఈ ఏడాది జులైలో రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, హనుమకొండ, మెదక్ జిల్లాలు రూ.200 కోట్ల మార్కును దాటాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ.611.98 కోట్ల విలువైన 6,08,129 కేసుల ఐఎంఎల్, 6,50,706 కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. ఐఎంఎల్ విషయంలో 3,02,167 కేసులతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉండగా, బీర్ల సేల్స్ విషయంలో 2,81,662 కేసులతో కరీంనగర్ రెండో స్థానంలో ఉంది.