అప్లికేషన్ల ఆమ్దానీ 193.36కోట్లు

అప్లికేషన్ల ఆమ్దానీ 193.36కోట్లు

వరంగల్, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త లిక్కర్‍ షాపులకు వ్యాపారుల నుంచి అప్లికేషన్ల వరద పారింది. ప్రభుత్వం కొత్త లైసెన్సుల కోసం అప్లై చేసుకోడానికి ఈ నెల 9 నుంచి గురువారం వరకు టైం ఇచ్చింది. దరఖాస్తులు నిన్నమొన్నటి దాక నామమాత్రంగానే రాగా చివరి రోజు మాత్రం మినీ జాతరను తలపించింది. 2021–2023 కొత్త పాలసీ డిసెంబర్‍  1 నుంచి ప్రారంభం కానుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 294 వైన్‍ షాపులు ఉండగా రికార్డ్ స్థాయిలో 9,668 అప్లికేషన్లు(రాత్రి 10గంటల వరకు) వచ్చాయి. ఒక్కో అప్లికేషన్​కు నాన్‍ రిఫండబుల్‍ ఫీజు రూ.2 లక్షల చొప్పున ఎక్సైజ్‍ శాఖకు చెల్లించారు. ఈ లెక్కన రాష్ట్ర ఖజానాకు రూ.193 కోట్ల 36 లక్షల ఆమ్దానీ వచ్చింది. 

గతంతో పోల్చితే పెరిగిన ఆదాయం..

ఉమ్మడి వరంగల్​లో 2019–2021 ఎక్సైజ్‍ పాలసీ ప్రకారం 261 వైన్‍ షాపులు ఉన్నాయి. వరంగల్‍ అర్బన్ లో 59 షాపులకు 1885, వరంగల్‍ రూరల్‍ 56 వైన్స్​కు 1768,  జనగామ 41 షాప్​లకు 1342, మహబూబాబాద్​లో 52 దుకాణాలకు 1532, భూపాలపల్లి/ములుగులో 53 షాపులకు 1575.. మొత్తంగా 261 షాపుల కోసం 8,102 అప్లికేషన్లు వచ్చాయి. ఒక్కోదానికి రూ.2 లక్షల చొప్పున రూ.162 కోట్ల 4 లక్షల ఆదాయం వచ్చింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు రూ.11 కోట్ల ఆదాయం పెరిగింది.

24 గంటల పాటు టెన్షన్‍..

జిల్లాలో కొత్త షాపుల లైసెన్స్​ల కోసం ఇచ్చిన గడువు ముగిసింది. జిల్లాల వారీగా వచ్చిన అప్లికేషన్లను ఆఫీసర్లు లెక్కగట్టారు. వీటికి సంబంధించి శుక్రవారం అప్లికేషన్ల స్క్రూటినీ జరగనుంది. శనివారం ఉదయం నుంచి ఆయా జిల్లాల్లో ఎంపిక చేసిన చోట కలెక్టర్‍ సమక్షంలో ఓపెన్‍ డ్రా నిర్వహిస్తారు. వైన్‍ షాపుల కోసం అక్కడిక్కడ అప్పులు చేసి.. అస్తులు అమ్మి అప్లికేషన్లు వేసిన వారంతా రాబోయే 24 గంటలు ఎలా గడుస్తుందా అన్నట్లుగా ఉన్నారు. లోలోపలే తమ ఇష్టాదైవాలకు మొక్కులు 
పెట్టుకుంటున్నారు.