లిక్కర్ పై బ్యాన్ విధించాలి : జాతీయ బీసీ మహిళా సంఘం

లిక్కర్ పై బ్యాన్ విధించాలి : జాతీయ బీసీ మహిళా సంఘం
  •     మహిళలు పారిశ్రామికంగా ఎదిగేందుకు చాన్స్ ఇవ్వాలి
  •     జాతీయ బీసీ మహిళా సంఘం డిమాండ్
  •     బీసీ మహిళలకు జనాభా ప్రకారం సబ్ కోటా ఇవ్వాలి: కృష్ణయ్య


ముషీరాబాద్, వెలుగు: స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నా మహిళల అభివృద్ధికి అవకాశాలు కల్పించడం లేదని జాతీయ బీసీ మహిళా సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో మద్యపాన నిషేధం పూర్తిగా అమలు చేయాలని, మహిళలు పారిశ్రామిక రంగంతో పాటు అన్ని రంగాల్లోనూ ఎదిగేందుకు రాయితీలు ప్రకటించాలని డిమాండ్  చేసింది. సోమవారం హైదరాబాద్ విద్యానగర్ లోని బీసీ భవన్ లో జాతీయ బీసీ మహిళా సంఘం సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా ప్రెసిడెంట్ గా డాక్టర్ ఎం.పద్మలతను నియమిస్తూ నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా బిల్లులో బీసీ మహిళలకు జనాభా ప్రకారం సబ్ కోటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే మహిళా బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందినప్పటికీ లోక్ సభ లో కూడా బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. దేశంలో బీసీ మహిళలు పార్లమెంటులో బీసీ బిల్లు కోసం, బీసీ మహిళా సబ్ కోటా కోరుతూ దేశవ్యాప్తంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.

మహిళా బిల్లులో రాజకీయ రిజర్వేషన్లతో పాటు విద్య, ఉద్యోగాల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ ఎ పద్మ లత డిమాండ్ చేశారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెడితే కేంద్ర ప్రభుత్వంలోని 54 లక్షల ఉద్యోగాల్లో 27 లక్షల ఉద్యోగాలు మహిళలకు దక్కుతాయని ఆమె పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ, బీసీ సంఘాల నాయకులు ఎర్ర సత్యనారాయణ, రాజేందర్  తదితరులు పాల్గొన్నారు.