స్మగ్లర్లు రోజు రోజుకు తెలివిమీరుతున్నారు. సినిమాలు, యూట్యూబ్లో చూస్తూ పోలీసులకు చిక్కకుండా నేరాలు చేస్తున్నారు. తాజాగా కొందరు నిందితులు మద్యాన్ని ఆశ్చర్యపోయే విధంగా అక్రమంగా రవాణా చేశారు. సినిమానే తలదన్నేలా మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. చివరకు బండారం బయటపడి కటకటాలపాలయ్యారు. పోలీసుల కళ్లు గప్పి..మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ విచ్చలవిడిగా అమ్ముతున్న ఓ ముఠాను మేడ్చల్ ఎక్సైజ్ శాఖ పోలీసులు పట్టుకున్నారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఎల్లంకిన్ రెడ్డి(48) అనే వ్యక్తి గత కొంత కాలంగా బాచిపల్లిలో నివాసం ఉంటున్నాడు. అతను కొద్ది రోజులుగా హరియాణ,ఢిల్లీ నుండి అక్రమంగా మద్యం దిగుమతి చేసుకుని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మేడ్చల్ టాస్క్ ఫోర్స్(ఎక్సైజ్)అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే ఎల్లంకిన్ రెడ్డి...సినిమాల్లో లాగా (DCM ) కంటైనర్లో ఒక చిన్న రూమ్ ను సెట్ చేసుకుని..అందులో మద్యం సీసాలను తరలిస్తున్నాడు. బయట నుంచి చూస్తే కంటైనర్..కానీ లోపల చిన్న రూమ్..ఈ రూమ్ లో మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నాడు. అయితే అధికారులకు అనుమానం వచ్చి పరిశీలించి చూడగా..అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఎల్లంకిన్ రెడ్డితో సహా ఏడుగురు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 40లక్షల విలువ చేసే 2000 మద్యం బాటిళ్లు, ఒక కారు, ఒక డిసియం వాహనం, ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.