పంచాయతీల్లో తేలిన రిజర్వేషన్లు..గ్రామాలు, వార్డుల వారీగా మండలాఫీసుల్లో లిస్ట్

పంచాయతీల్లో తేలిన రిజర్వేషన్లు..గ్రామాలు, వార్డుల వారీగా మండలాఫీసుల్లో లిస్ట్
  • ఇప్పటికే గెజిట్​ రిలీజ్​చేసిన పలు జిల్లాల కలెక్టర్లు
  • నేడు ఎస్​ఈసీకి రిజర్వేషన్ల లిస్టులు 
  • అందజేయనున్న పీఆర్​ ఆఫీసర్లు
  • పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్న ఆశావహులు
  • మొత్తం గ్రామీణ ఓటర్లు కోటి 67 లక్షల మంది 
  • 12,733 సర్పంచ్ స్థానాలకు, 1,12,288 వార్డులకు ఎలక్షన్స్​
  • మూడు దశల్లో జరిపేందుకు ఎస్​ఈసీ సూత్రప్రాయ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు:  గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. గ్రామం, వార్డులు ఏ సామాజికవర్గానికి కేటాయించారో తేలిపోయింది. ఇప్పటికే జయశంకర్​ భూపాలపల్లి,  ఖమ్మం, జోగుళాంబ గద్వాల, మెదక్​ వంటి అనేక జిల్లాల్లో కలెక్టర్లు రిజర్వేషన్లకు సంబంధించి గెజిట్​ నోటిఫికేషన్లు కూడా జారీ చేశారు. పలు జిల్లాల నుంచి హైదరాబాద్‌‌‌‌ లోని పంచాయతీరాజ్ కమిషనరేట్​కు రిజర్వేషన్ల జాబితాలు అందాయి. మిగిలిన జిల్లాల నుంచి సోమవారం వరకు అందనున్నాయి. అన్ని జిల్లాల నుంచి లిస్టులు వచ్చిన తర్వాత పరిశీలించి, వాటిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్​ఈసీ) పీఆర్​ అధికారులు అందజేస్తారు. 

జీవో 46 మార్గదర్శకాల ప్రకారం కోటా

ఎస్టీ, ఎస్సీ, బీసీ సామాజికవర్గాల రిజర్వేషన్లు 50 శాతానికి దాటొద్దని పంచాయతీరాజ్​శాఖ జారీ చేసిన 46 జీవోలోని మార్గదర్శకాలకు తగ్గట్టు అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), వెనుకబడిన తరగతులు (బీసీ), జనరల్ (అన్​ రిజర్వ్డ్​), మహిళలకు కేటాయించిన స్థానాల వివరాలను అనెక్సర్​ రూపంలో ప్రకటించారు. గ్రామాలు, వార్డుల వారీగా కేటాయించిన రిజర్వేషన్ల పూర్తి వివరాలు ఆయా మండల కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని అధికారులుతెలియజేశారు.

పోటీకి ఆశావహుల ఏర్పాట్లు

రిజర్వేషన్ల ఖరారుతో గ్రామాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఆశావహులు తమ మండలంలో సామాజికవర్గాల వారీగా ఎవరికి ఎన్ని స్థానాలు దక్కాయో తెలుసుకునే పనిలో ఉన్నారు.  రిజర్వేషన్​ కలిసొచ్చినవారు పోటీ చేసేందుకు అన్నీ రెడీ చేసుకుంటున్నారు. 

పీఆర్​ కమిషనరేట్​కు లిస్టులు

సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి జిల్లాల వారీగా ఖరారైన రిజర్వేషన్ల జాబితాలు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పంచాయతీరాజ్ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధికారులు అందజేస్తున్నారు. డీపీవోలు స్వయంగా వచ్చి సీల్డ్​ కవర్​లో రిజర్వేషన్ల జాబితాలను అప్పగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల నుంచి రిజర్వేషన్ల లిస్టులు చేరగా.. మిగిలిన జిల్లాల నుంచి సోమవారం ఉదయం వరకు అందనున్నాయి. అన్నిజిల్లాల నుంచి జాబితాలు వచ్చిన తర్వాత పరిశీలించి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్​ఈసీ) పీఆర్​ అధికారులు అందజేస్తారు. 

కోటి 67 లక్షల మంది గ్రామీణ ఓటర్లు

రాష్ట్రంలో గ్రామీణ ఓటర్ల లెక్క తేలింది. ప్రస్తుతం గ్రామీణ ఓటర్లు 1,67,03,173 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 81,65,899 మంది, మహిళలు 85,36,770 మంది ఉండగా.. ఇతరులు 504 మంది ఉన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో గ్రామ పంచాయతీల వారీగా వార్డుల విభజన, ఓటర్ల తుది జాబితాను అధికారులు రిలీజ్​ చేశారు. ఓటర్ల జాబితాలో వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి అధికారులు పరిష్కరించారు. ఆదివారం గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో  ఫొటోలతో కూడిన తుది ముసాయిదా ఓటరు జాబితాలను ప్రదర్శించారు. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 1,12,474 పోలింగ్​ స్టేషన్లు, 15,522 పోలింగ్​ ప్రాంతాలను గుర్తించారు. రాష్ట్రంలో  12,733 సర్పంచ్​ స్థానాలకు, 1,12,288 వార్డులకు ఎలక్షన్స్​ జరగనున్నాయి. మూడు దశల్లో నిర్వహించేందుకు ఎస్​ఈసీ సూత్రపాయంగా నిర్ణయించింది.  

వెబ్ కాస్టింగ్​కు టెండర్లు

ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు వెబ్ కాస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అధికారులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో నిఘా ఉంచేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు, లైవ్ వెబ్ కాస్టింగ్ కోసం జిల్లాల వారీగా టెండర్లు ఆహ్వానించారు. ఈ మేరకు ఆయా జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేశారు. టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని సూచించారు.  జిల్లాల వారీగా వెబ్​కాస్టింగ్​ సెంటర్ల వివరాలు కూడా పీఆర్​ కమిషనరేట్​కు చేరినట్లు తెలిసింది. 

నేడు హైకోర్టులో వాదనలు

పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కేసు సోమవారం హైకోర్టులో విచారణకు రానున్నది. ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని, పంచాయతీల్లో 50 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసి జీవోలు కూడా ఇచ్చామని న్యాయస్థానం దృష్టికి పీఆర్, ఆర్డీ శాఖ తీసుకెళ్లనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశామని, ఇటీవల ఎన్నికల సన్నద్ధతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించినట్లు తెలియజేయనున్నది. కోర్టు ఆదేశాలకు తగ్గట్టు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పనుంది. 

ఎక్కడికక్కడ గెజిట్ ​నోటిఫికేషన్లు

చాలా జిల్లాల్లో ఆయా కలెక్టర్లు రిజర్వేషన్లకు సంబంధించి గెజిట్​ నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇందులో జయశంకర్​ భూపాలపల్లి,  ఖమ్మం, జోగుళాంబ గద్వాల, మెదక్​ వంటి జిల్లాలు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడి కలెక్టర్లు గెజిట్​ నోటిఫకేషన్లను జారీ చేసే పనిలో ఉన్నారు.  
    
జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో 248 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో సర్పంచ్​ రిజర్వేషన్లు:  వంద శాతం గిరిజన జనాభా ఉన్న గ్రామాలు 7 ఉన్నాయి. ఇందులో ఎస్టీ మహిళలకు 2, ఎస్టీ జనరల్​కు 5 కేటాయించారు. నాన్​ షెడ్యూల్​ ఏరియాల్లో ఎస్టీ మహిళలకు 9, ఎస్టీ జనరల్​కు 12, ఎస్సీ మహిళలకు 23, ఎస్సీ జనరల్​ 28 స్థానాలు దక్కాయి. ఓవరాల్​గా బీసీ మహిళలకు 21, బీసీ జనరల్​కు 25 స్థానాలు కేటాయించారు. అన్​రిజర్వ్‌‌డ్ స్థానాల్లో మహిళలకు 59, జనరల్​ 64 స్థానాలు దక్కాయి.  
    
ఖమ్మం జిల్లాలో 571 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.  ఇందులో సర్పంచ్​ రిజర్వేషన్లు: జిల్లాలో వందశాతం గిరిజన జనాభా ఉన్న గ్రామాలు 11 ఉన్నాయి. ఇందులో ఎస్టీ మహిళలకు 3, ఎస్టీ జనరల్​కు 8 కేటాయించారు. షెడ్యూల్​ ఏరియాలో ఎస్టీ మహిళకు 48, ఎస్టీ జనరల్​51, నాన్​ షెడ్యూల్​ ఏరియా ఎస్టీ మహిళలకు 25, ఎస్టీ జనరల్​కు 36,  ఎస్సీ మహిళలకు 48, ఎస్సీ జనరల్​కు 62, బీసీ మహిళలకు 24, బీసీ జనరల్​కు 30, అన్​రిజర్వ్‌‌డ్ స్థానాల్లో మహిళలకు 112, జనరల్​ 124 స్థానాలు కేటాయించారు. 
    
జోగులాంబ గద్వాల జిల్లాలో 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో సర్పంచ్​ రిజర్వేషన్లు: ఎస్టీలకు సున్న, ఎస్సీలకు 3 స్థానాలు (ఇందులో ఎస్సీ మహిళకు 1, ఎస్సీ జనరల్​ 2)  కేటాయించారు. బీసీలకు 4 స్థానాలు కేటాయించగా.. ఇందులో బీసీ మహిళలకు 2, బీసీ జనరల్​కు  2 దక్కాయి. అన్​రిజర్వ్‌‌డ్​ స్థానాలు 7 ఉండగా.. ఇందులో మహిళలకు 3,జనరల్​ 4 దక్కాయి. 

మెదక్​ జిల్లాలో 492 గ్రామ

పంచాయతీలు ఉన్నాయి. ఇందులో సర్పంచ్​ రిజర్వేషన్లు: జిల్లాలో వందశాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామాల్లో ఎస్టీ మహిళకు 29, ఎస్టీ జనరల్​ 42 సీట్లు దక్కాయి. నాన్​ షెడ్యూల్​ ఏరియాలో ఎస్టీ మహిళలకు  10, ఎస్టీ జనరల్​కు  11,ఎస్సీ మహిళలకు 33, ఎస్సీ జనరల్​కు  44,బీసీ మహిళలకు 49, బీసీ జనరల్​కు 59 సీట్లు కేటాయించారు.  అన్​రిజర్వ్‌‌డ్‌‌ స్థానాల్లో మహిళలకు 102, జనరల్​ 113 స్థానాలు దక్కాయి.