బాధితుడికి తెలియకుండానే లోన్ తీసుకున్నారు..స్కామర్లు రూ.4 లక్షలు దోచేశారు..

బాధితుడికి తెలియకుండానే లోన్ తీసుకున్నారు..స్కామర్లు రూ.4 లక్షలు దోచేశారు..

బషీర్​బాగ్, వెలుగు: ఓ బాధితుడి పేరుపై అతనికి తెలియకుండానే లోన్స్ తీసుకొని, ఆ డబ్బులను స్కామర్స్ వారి ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతానికి చెందిన 40 ఏండ్ల బాధితుడి మొబైల్​కు అతనికి అకౌంట్​ఉన్న హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ నుంచి రెండు మెసేజ్ లు వచ్చాయి. అందులో ఇన్​స్టంట్​లోన్, జంబో లోన్స్ ద్వారా మొత్తం రూ.3.91 లక్షలు అకౌంట్​లో క్రెడిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. బాధితుడు తన అకౌంట్ చెక్ చేయగా రూ.4 లక్షల బ్యాలెన్స్ కనిపించింది. 

తాను ఎలాంటి లోన్స్​అప్లై చేయలేదని బ్యాంక్ అధికారులకు కాల్ చేసి ఫిర్యాదు చేయబోగా, మరోసారి ఆ మొత్తం డబ్బులు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. కొన్నిరోజుల కింద తెలియని నంబర్ నుంచి ఆర్టీవో చలాన్​పేరుతో వచ్చిన ఏపీకే ఫైల్​ను ఫోన్ లో ఇంస్టాల్ చేసినట్లు గుర్తు చేసుకున్నాడు. 

దీంతో స్కామర్స్ తన ఫోన్​ను హ్యాక్ చేసి, లోన్ తీసుకొని, ఆ డబ్బులను బదిలీ చేసుకున్నట్లు గుర్తించాడు. అనంతరం బాధితుడు తన ఫోన్ ను ఫార్మాట్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడుతో ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.