V6 News

Telangana Local Body Elections: ఊరూరా దావత్‌‌లు.. అర్ధరాత్రి దాకా ప్రలోభాలు.. పోలింగ్ లోపు ఇంత జరిగిందా..?

Telangana Local Body Elections: ఊరూరా దావత్‌‌లు.. అర్ధరాత్రి దాకా ప్రలోభాలు.. పోలింగ్ లోపు ఇంత జరిగిందా..?
  • 7 నుంచి ఒంటి గంట దాకా పోలింగ్.. తర్వాత లెక్కింపు.. ఫలితాలు
  • ఓటర్లను ఖుష్​ చేసేందుకు పోటీపడ్డ అభ్యర్థులు.. ఇంటింటికీ మందు..మద్దతుదారుల ఇండ్లలో విందు
  • ఒకరికి మించి ఒకరు ఎక్కువ డబ్బులు పంపిణీ చేస్తున్న క్యాండిడేట్స్​
  • ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో ఓటుకు రూ. 5 వేల నుంచి రూ. 6 వేల దాకా ఇచ్చిన అభ్యర్థి
  • కుల సంఘాలకైతే లక్షకు పైగానే సమర్పణ

వెలుగు, నెట్​వర్క్​: తెల్లారితే ఎన్నికలు ఉండడంతో బుధవారం రాత్రి పంచాయతీ బరిలో ఉన్న అభ్యర్థులకు నిద్ర కరువైంది. చేతిలో చెయ్యేసి ఒట్టేసిన ఓటర్లు ఎక్కడ ఆడిన మాట తప్పుతారోననే అనుమానంతో రాత్రి రాత్రే ఇండ్లన్నీ చుట్టేశారు. చీకటిపడగానే ఊరూరా ప్రలోభాలకు తెరతీశారు. అనేక గ్రామాల్లో ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ.2 వేల దాకా పంచారు. 

ఒక ఇంట్లో నలుగురు ఉంటే రూ.8 వేల నుంచి రూ.10 వేల దాకా ముట్టజెప్పారు. కొన్ని మేజర్​ పంచాయతీలు, ఆదాయం ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ఓటుకు రూ.5 వేల దాకా ఇచ్చినట్లు తెలుస్తున్నది. చాలా చోట్ల కులసంఘాల పెద్దలకు రూ.లక్షకు పైగా చదివించుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇక తాగినోళ్లకు తాగినంత అన్నట్లుగా ఓటరుకు క్వార్టర్‌‌‌‌‌‌‌‌ నుంచి హాఫ్​ బాటిల్‌‌‌‌ దాకా, ఇంట్లో నలుగురుంటే ఫుల్​బాటిల్‌‌‌‌ మందు, చికెన్​కవర్లు అందాయి.

ఎలక్షన్లు ఉన్న గ్రామాల్లో ఉదయం నుంచే పండుగ వాతావరణం నెలకొన్నది. బహిరంగంగా దావత్‌‌‌‌లు ఏర్పాటు చేస్తే ఎన్నికల అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన అభ్యర్థులు.. ఎక్కడికక్కడ తమ మద్దతుదారుల ఇండ్లలో విందు ఏర్పాట్లు చేశారు. బయటకు చూస్తే ఫ్యామిలీ ఫంక్షన్​లా కనిపించేలా చికెన్​, మటన్ వంటకాలతోపాటు మందు కూడా సప్లై చేశారు.

10, 15 మంది మాత్రమే హాజరవుతుండడంతో అధికారుల దృష్టి పడలేదు. కేవలం దావత్‌‌‌‌లతో పని జరగదనుకున్న చోట్ల పైసల పంపిణీకి తెరతీశారు. ఒక అభ్యర్థి ఓటుకు వెయ్యి ఇస్తే, ప్రత్యర్థి ​2  వేలు పంచడం, ఈ విషయం తెలిసి మొదటి అభ్యర్థి మరో వెయ్యి చొప్పున చేతిలోపెట్టడం.. చాలా గ్రామాల్లో ఇదే తంతు కనిపించింది.

జిల్లాల వారీగా ఇలా..
* నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్​ జిల్లాలోని రియల్​ఎస్టేట్​ దందా జరిగే గ్రామాల్లో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు పంపిణీ చేశారు. ఓ గ్రామంలో ఉంగరం గుర్తు వచ్చిన అభ్యర్థి.. వెండి ఉంగరంతోపాటు ఓటుకు రూ. వెయ్యి చొప్పున అందజేశాడు.. తాడూరు మండలంలోని ఓ గ్రామంలో గుడి కట్టిస్తామని సర్పంచ్​అభ్యర్థి హామీ ఇచ్చాడు. బుధవారం రాత్రి గ్రామంలోని యువకులు, వృద్ధులు, మహిళలకు వేర్వేరుగా దావత్‌‌‌‌లు ఇచ్చాడు.  కల్వకుర్తి మండలం తర్నికల్, తాండ్రలో సర్పంచ్‌‌‌‌ అభ్యర్థులు ఓటుకు రూ.2 వేల వరకు ఇచ్చారు. పెద్దముద్దునూరు తదితర గ్రామాల్లో వృద్ధులకు, మహిళలకు మద్యం, చికెన్​, మటన్, రొట్టెలతో విందు ఇచ్చారు. 
* ఖమ్మం జిల్లాలో రిజర్వుడ్‌‌‌‌ పంచాయతీల్లో రూ.500 చొప్పున పంపిణీ చేస్తుండగా, మరికొన్ని చోట్ల రూ.వెయ్యి నుంచి 1500 వరకు ఇచ్చారు. ఎర్రుపాలెం మండలం కొత్తపాలెం గ్రామ పంచాయతీలో ఓటుకు రూ. 5 వేల నుంచి రూ. 6 వేలు పంపిణీ చేసినట్టు సమాచారం. ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో ఒక అభ్యర్థి రూ. కోటి వరకు ఖర్చుచేస్తున్నట్టు తెలుస్తున్నది. పంచాయతీకి పెద్దగా ఆదాయం లేకపోయినా పంతంతో ఖర్చు చేస్తున్నట్టు చెప్తున్నారు. చింతకాని ‌‌‌‌మండలం పందిళ్లపల్లిలో ఒక అభ్యర్థి ఇంటికి ఒక కుక్కర్‌‌‌‌‌‌‌‌, మహిళా ఓటర్లకు ఒక్క చీర, కేజీ చికెన్, మందు పంచారు. 
* సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరులో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు రూ. 3 వేల చొప్పున పంపిణీ చేశారు. ఇండస్ట్రియల్ ఏరియాకు దగ్గరగా ఉన్న ఈ పంచాయతీ సర్పంచ్ పదవికి నలుగురు పోటీ చేస్తుండగా.. ఒకే పార్టీ మద్దతుదారులమని చెప్పుకుంటున్న ఇద్దరు పోటీ పడి మరీ డబ్బులు పంచారు. ములుగులో రెండు ప్రధాన పార్టీల మద్దుతుదారులైన అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. 
* భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరిలో ఓ పార్టీ అభ్యర్థి ఓటుకు రూ. 500 చొప్పున పంపిణీ చేయగా.. అదేపార్టీ కి చెందిన రెబల్ అభ్యర్థి రూ. వెయ్యి చొప్పున ఓటర్లకు పంచుతున్నారు. ఈవిషయం తెలిసి మొదటి అభ్యర్థి మరో రూ.500 చొప్పున కొందరికి ఇచ్చినట్లు తెలిసింది.  భూపాలపల్లి జిల్లా చెల్పూర్, గణపురం, మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సిపేట, ఆకినపల్లిలో అభ్యర్థులు ఓటుకు రూ.  వెయ్యి చొప్పున పంచినట్లు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇదే మండలంలోని చాలా గ్రామాల్లో ఇంటికి కిలో చొప్పున చికెన్, మహిళా ఓటర్లకు చీరలు పంపిణీ చేయడం గమనార్హం.
* నిర్మల్ జిల్లా లక్ష్మణచందా  సర్పంచ్​ పదవికి ముగ్గురు పోటీలో ఉండగా.. ఇద్దరు  ఓటుకు రూ. 500 చొప్పున ఇచ్చారు. చామన్ పల్లిలోనూ ఇద్దరు అభ్యర్థులు రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. ఖానాపూర్ మండలం లోని మస్కాపూర్, సూర్జపూర్, ఎర్వాచింతల్, రంగంపేట గ్రామాల్లో అభ్యర్థులు ఇంటింటికీ మద్యం బాటిళ్లు పంపించారు.
* హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్, కొత్తపల్లి, కొత్తకొండ, గట్ల నర్సింగాపూర్, రత్నగిరి గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. వార్డు మెంబర్ అభ్యర్థులు ఓటుకు రూ.200 చొప్పున పంచారు. పురుష ఓటర్లకు అదనంగా క్వార్టర్​బాటిళ్లు అందజేశారు. 
* నిజామాబాద్​ జిల్లా రెంజల్​ మండలంలోని పలు గ్రామాల్లో ఓటుకు రూ.5 వేల వరకు ఇచ్చారు. ఒట్టు పెట్టించి మరీ డబ్బులు పంచారు.  బరిలో  వలస ఓటర్లను రప్పించడానికి ఐదుగురికి ఒక కారు చొప్పున ఎంగేజ్​ చేశారు.  ఒక్క ఓటరే ఉంటే బస్ చార్జీలతోపాటు రూ.2 వేల చొప్పున చెల్లించారు. కొన్ని చోట్ల కుల సంఘాలను రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు అందజేశారు. కామారెడ్డి జిల్లా దోమకొండలో ఓ అభ్యర్థికి ఓటుకు రూ. 200 పంపిణీ చేశారు. భిక్కనూరులో మద్యం పంపిణీ చేశారు. దాదాపు అన్ని పంచాయతీల్లో ఓటుకు రూ. 200 నుంచి రూ. 500 వరకు పంచిపెట్టినట్టు సమాచారం.
* ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం తాడిహత్నూర్‌‌‌‌‌‌‌‌లో నిబంధనలకు విరుద్ధంగా తన ఇంటి దగ్గర 50 మంది తో మీటింగ్​ నిర్వహించిన సర్పంచ్ అభ్యర్థి ఆర్. మధుకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. 
* ఖమ్మం జిల్లా మధిర మండలం నక్కలగరువు గ్రామ పంచాయతీలో మొత్తం 585 ఓట్లు ఉండగా.. 8 వార్డులు ఉన్నాయి. ఈ గ్రామంలో ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉండగా ఒక అభ్యర్థి ఓటుకు మూడు వేల చొప్పున పంపిణీ చేయగా.. విషయం తెలుసుకున్న మరో అభ్యర్థి ఓటుకు 5 వేల చొప్పున పంపిణీ చేసినట్టు తెలిసింది.
* జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ఉప్పేర్  పంచాయతీలో  పలువురు అభ్యర్థులు ఓటుకు రూ. 2 వేల చొప్పున పంపిణీ చేశారు. కోతుల గిద్ద గ్రామంలో వెయ్యి రూపాయల చొప్పున, గద్వాల మండలం బీరెల్లిలో వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ చేసినట్టు తెలిసింది.
* వనపర్తి జిల్లాలోని పెద్దమందడి గ్రామంలో ఓటు కు రూ.వెయ్యి , క్వార్టర్​బాటిల్​ చొప్పున పంపిణీ చేశారు. ఖిలాగణపురం లో ఓటుకు రూ.500 నుంచి రూ.వెయ్యి దాకా అందజేశారు.  గోపాల్‌‌‌‌పేట, రేవల్లి,  ఏదుల మండలాల్లో ఓటుకు రూ.వెయ్యి, వలస ఓటర్ల కు బస్సు చార్జీలు అందజేశారు. 
* కరీంనగర్ జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి ప్రలోభాల పర్వం మొదలైంది. గ్రామాల్లో తక్కువలో తక్కువ రూ.500 నుంచి గరిష్టంగా రూ.3 వేల వరకు నగదు పంపిణీ చేశారు. కొన్ని చోట్ల డబ్బులతోపాటు క్వార్టర్ లిక్కర్ బాటిల్ ఇచ్చారు.
* ములుగు జిల్లాలోని మారుమూల ఏటూరు నాగారం, గోవిందరావు పేట మండలాల్లోని మేజర్ గ్రామపంచాయతీల్లోనూ ఓటుకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేశారు.

పైసలు పంచ.. మందు తాప..ఇంటి ముందు బోర్డుపెట్టిన భిక్కనూరు సర్పంచ్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌
‘పైసలు పంచ.. మందు తాప.. నిజాయితీగా ఆలోచించి ఓటు వేయండి’ అంటూ ఓ సర్పంచ్‌‌‌‌ క్యాండిడేట్​తన ఇంటిముందు బోర్డు పెట్టేశారు.  ‘మేం ఓట్లు కొనం..’ అంటూ ముఖం మీదే చెప్పేయడం చర్చనీయాంశంగా మారింది.  కామారెడ్డి జిల్లా భిక్కనూరుకు చెందిన పి. మైత్రేయి సర్పంచ్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌గా పోటీ చేస్తున్నారు. రెండు రోజుల కింది వరకు జోరుగా ప్రచారం చేశారు.  క్యాంపెయిన్​ గడువు ముగియడంతో కొందరు ఓటర్లు, నాయకులు ఆమె వద్దకు వెళ్లి ‘మాకు ఏమైనా ఇవ్వాలి’ అని అడిగారు. దీంతో విసుగు చెందిన ఆ క్యాండిడేట్‌‌‌‌ తన ఇంటి ముందు ‘డోంట్‌‌‌‌ డిస్టర్బ్’ అంటూ బోర్డు పెట్టేశారు.