ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే

ప్ర‌త్యేకాధికారుల పాల‌న జనవరి 2 వరకు పొడిగింపు

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్తల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు నేతలు.. అటు అధికారులు.. సిబ్బంది అందరూ కరోనాపైనే దృష్టి కేంద్రీకరిరంచాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గత మార్చి నెలలో వాయిదా వేసిన ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో రాష్ట ప్రభుత్వం స్థానిక సంస్థ‌ల్లో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 108 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తూ గురువారం నొటిఫికేషన్ జారీ చేసింది. కరోనా వైర‌స్‌ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌ వాయిదా వేయడంతో ఈ నొటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు పురపాలకశాఖ ఉత్వ‌ర్వుల్లో పేర్కొంది. నిజానికి ఈ ఏడాది మార్చి 10న కార్పొరేషన్‌లో, జూన్ 30న మున్సిపాలిటీల‌లో, జూలై 2తో నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ముగిసింది.

అయితే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌టంతో శ్రీకాకుళంలో అక్టోబర్ 10 వరకు మాత్ర‌మే ప్రత్యేకాధికారుల పాలన పొడిగించ‌గా మిగ‌తా అన్ని జిల్లాల్లోని కార్పొరేషన్లలోనూ డిసెంబర్‌ 31 వరకు ఈ పాలనను పొడిగించింది. విజయనగరం, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలనను డిసెంబర్ 31 వరకు లేదా పాలకవర్గం ఏర్పాటయ్యే వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లోనూ వ‌చ్చే ఏడాది జనవరి 2 వరకు ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తున్న‌ట్లు నొటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లే క‌నిపిస్తోంది.