73 గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం.. మళ్లీ మొదటికి స్థానిక ఎన్నికల ప్రక్రియ..!

73 గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం.. మళ్లీ మొదటికి స్థానిక ఎన్నికల ప్రక్రియ..!
  • స్థానిక ఎన్నికల ప్రక్రియ  మళ్లీ మొదటికి..!
  • 73 గ్రామ పంచాయతీలు మున్సిపాల్టీల్లో విలీనం
  • మారనున్న భౌగోళిక స్వరూపం
  • ఇక 12,775 గ్రామాలకే స్థానిక సంస్థల ఎన్నికలు
  • ఓటరు జాబితాలోనూ మార్పులు.. మళ్లీ వార్డుల విభజన
  • ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీల సంఖ్యలో తేడాలు
  • 73 గ్రామాలు విలీనం చేస్తూ గెజిట్ విడుదల

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటికి రానున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 73 గ్రామ పంచాయతీలను మున్సిపాల్టీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా గ్రామాలు మున్సిపాల్టీ పరిధిలోకి వెళ్లనున్నాయి. దీనివల్ల పంచాయతీల స్వరూపం పూర్తిగా మారిపోనున్నది. మళ్లీ కొత్తగా ఓటరు జాబితా నుంచి పోలింగ్ కేంద్రాల వరకు మార్పులు చోటు చేసుకోనున్నాయి. అయితే, అంతకు ముందుకు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. 

ఓటరు జాబితా, పంచాయతీల్లో వార్డుల విభజన, పోలింగ్ కేంద్రాల గుర్తింపుతో పాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి లేదంటే మార్చిలో ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. అందుకు అనుగుణంగానే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపరు, ఎన్నికల సామగ్రి రెడీ చేశారు. ఆర్వోలు, పీవోలకు ట్రైనింగ్ ఇచ్చారు. వివిధ రాజకీయ పక్షాల నాయకులతో ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. ఎన్నికల అధికారులకు శిక్షణ కూడా పూర్తి చేశారు. 

ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగలేదు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉండటంతో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అనేదానిపై క్లారిటీ లేదు. కాగా, పంచాయతీల పాలనా గడువు ముగిసి ఏడాది అవుతున్నా.. ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో గ్రామాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ప్రత్యేక అధికారులు గ్రామాలపై కన్నెత్తి చూడకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతుందని పల్లెవాసులు పేర్కొంటున్నారు. 

మారనున్న స్వరూపం

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో తరచూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని పంచాయతీలు మున్సిపాల్టీల్లో కలవడంతో గ్రామాల భౌగోళిక స్వరూపం మారిపోతుంది. గతంలో రూపొందించిన ఓటరు జాబితాలూ మారిపోతాయి. మళ్లీ వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేయాల్సి ఉంటుంది. వార్డుల విభజన చేయాలి. ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ స్థానాల సంఖ్యలోనూ తేడాలు వస్తాయి. రిజర్వేషన్లలోనూ మార్పులు జరుగుతాయని అధికారులు అంటున్నారు. 

73 పంచాయతీలు మున్సిపాల్టీల్లో కలవక ముందు రాష్ట్రంలో 12,848 గ్రామాల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ, ఎన్నికలు జరగలేదు. ఇందులో కొన్ని గ్రామాలు మున్సిపాల్టీల్లో విలీనంతో 12,775 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. 570 ఎంపీపీ స్థానాలు ఉండగా.. ఇక మీద 567  మండలాలకు మాత్రమే ఎంపీపీలను ఎన్నుకోనున్నారు. ఎంపీపీ స్థానాల సంఖ్య ఎంతో జడ్పీటీసీల స్థానాల సంఖ్య కూడా అంతే ఉంటుంది. 

తగ్గనున్న ఒక జడ్పీ చైర్మన్ పోస్టు

రాష్ట్రంలో ప్రస్తుతం 32 జడ్పీ చైర్మన్ స్థానాలు ఉండగా.. మేడ్చల్ జిల్లాలోని గ్రామాలు సిటీలో కలపడంతో ఒక జడ్పీ చైర్మన్ స్థానం తగ్గిపోనున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,13,380 వార్డులు ఉండగా.. దాదాపు 700 వరకు వార్డులు తగ్గనున్నాయి. ఎంపీటీసీ స్థానాలు 5,457 ఉండగా.. 100 నుంచి 150 స్థానాల వరకు తగ్గే అవకాశం ఉంది. పల్లె ఓటర్లు 2.20 కోట్ల మంది ఉండగా.. వీరి సంఖ్య భారీగా తగ్గనున్నది. కొత్తగా ఓటరు జాబితా రూపొందించాలన్నా.. వార్డులు విభజన, పోలింగ్ కేంద్రాల గుర్తించాలంటే మళ్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఈ ప్రక్రియ మొదలు పెట్టనున్నారు.  

గెజిట్ విడుదల

రాష్ట్రంలో 73 గ్రామాలను మున్సిపాల్టీలో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీంతో ఈ గ్రామాలు లోకల్ బాడీ ఎన్నికల నుంచి తొలగించారు. ములుగు, కల్లూరు, బిచ్కుంద, అలియాబాద్, రామగుండం, పెద్ద అంబర్‌‌‌‌పేట, చేవెళ్ల, మొయినాబాద్‌‌ కొత్తగూడెం, అమీన్‌‌పూర్‌‌‌‌, మద్దూరుతో పాటు పలు మున్సిపాల్టీల్లో 73 గ్రామాలు కలిసిపోయాయి. 

స్థానిక ఎన్నికల నుంచి మేడ్చల్ జిల్లా ఔట్

మేడ్చల్ జిల్లాలో మొత్తం 62 గ్రామాలు ఉండగా.. గతంలో 28 గ్రామాలు పలు మున్సిపాల్టీల్లో కలిశాయి. తాజాగా 32 గ్రామాలు సిటీలో విలీనం కావడంతో మేడ్చల్ జిల్లా స్థానిక ఎన్నికల నుంచి తొలగించనున్నారు. అల్వాల్, బాచుపల్లి, బాలానగర్, దుండిగల్, ఘట్‌‌కేసర్, జీడిమెట్ల, కాప్రా, కీసర, కూకట్‌‌పల్లి, మల్కాజ్‌‌గిరి, మేడ్చల్, మేడిపల్లి, ముచింతల్, కుత్బుల్లాపూర్, షామీర్‌‌పేట మండలాలు ఉన్నాయి.

 ఇందులో కొన్ని అర్బన్ మండలాలు ఉన్నాయి. 5 మండలాలకు ఎంపీపీలు, జడ్పీటీలు ఉండగా.. ఇక మీద ఆ మండలాల్లో లోకల్ బాడీ ఎన్నికల నుంచి తొలగించనున్నారు. ఆ మండలాల్లో ఇక మున్సిపాల్టీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 243 గ్రామాలు విలీనం కాగా.. 223 గ్రామాలు కొత్తగా ఏర్పడ్డాయి.