సర్కార్ రూల్స్ మేం ఫాలో అవ్వం

సర్కార్ రూల్స్ మేం ఫాలో అవ్వం

ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్న స్థానిక సంస్థల నేతలు

భార్యలకు బదులు భర్తలు, కొడుకులదే పెత్తనం

హైదరాబాద్, వెలుగు: ‘‘స్థానిక సంస్థల పాలన వ్యవహారాల్లో ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుంటే కఠినంగా వ్యవహరిస్తం. గ్రామ, మండల, జిల్లా పరిషత్ సమావేశాల్లో నేతల తరుపున వారి కుటుంబ సభ్యులు పాల్గొంటే వారిపై, అనుమతించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటాం ’’.. ఇదీ ఈ నెల 19న పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు జారీ చేసిన ఉత్తర్వులు. ఆ ఉత్తర్వులను స్థానిక సంస్థల నేతలు పట్టించుకోవట్లేదు. ఈ నెల 27న ఆదిలాబాద్ లో తహసీల్దార్ ఆఫీస్ లో ఎమ్మెల్యే జోగు రామన్న అధ్యక్షతన జరిగిన కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మహిళా ప్రజా ప్రతినిధులకు బదులు వారి భర్తలు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కాలూరు సర్పంచ్ యశోదమ్మ బదులు మండల పరిషత్ సమావేశంలో ఆమె భర్త తిరుపాల్ నాయుడు హాజరయ్యారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్న మెట్ పల్లి మహిళా సర్పంచ్ కు బదులు ఆమె కొడుకు ముత్తయ్య పాలన సాగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం జరుగుతున్నాయి.

చోద్యం చూస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు పాల్గొనే అభివృద్ధి కార్యక్రమాలు, మీటింగ్ లలో భార్యలకు బదులు భర్తలు, కొడుకులు అటెండ్ అవుతున్నారు. అయినా వారిని హెచ్చరించిన దాఖలాలు కనపడటం లేదు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులైతే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఉన్న చోట్ల మాత్రం అత్యుత్సాహం చూపిస్తూ షోకాజ్ నోటీసులు ఇస్తున్నారని పలువురు చెబుతున్నారు.

గవర్నర్, సీఎస్ కు లెటర్ రాశాం

స్ధానిక సంస్ధల్లో భర్తలు, కొడుకుల ప్రమేయంపై గవర్నర్ తమిళి సై, సీఎస్ సోమేశ్ కుమార్ కు ఈ మధ్య లెటర్ రాశాం. ఈ సమస్యపై మూడు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాం. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, అనర్హత వేటు వేయాలని ప్రతిపాదించాం. మహిళా ప్రజా ప్రతినిధులకే నిర్ణయాధికారం ఇవ్వాలని చెప్పాం. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా.. ఇవి జరుగుతుండటం బాధాకరం. -పద్మనాభ రెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి