మందుబాబులు, రాష్ట్రాల‌కు కేంద్రం షాక్: దేశ‌మంతా లిక్క‌ర్ షాపులు క్లోజ్ చేయాల్సిందే!

మందుబాబులు, రాష్ట్రాల‌కు కేంద్రం షాక్: దేశ‌మంతా లిక్క‌ర్ షాపులు క్లోజ్ చేయాల్సిందే!

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు దేశ‌వ్యాప్తంగా మే 3 వ‌ర‌కు లాక్ డౌన్ పొడిగించింది కేంద్ర ప్ర‌భుత్వం. ఈ రెండో ద‌శ లాక్ డౌన్ కు సంబంధించిన బుధ‌వారం ఉద‌యం కేంద్ర హోం శాఖ మార్గ‌దర్శ‌కాలు జారీ చేసింది. హాట్ స్పాట్స్ లో క‌ఠినంగా లాక్ డౌన్ పాటించాల్సిందేని స్ప‌ష్టం చేసింది. అయితే క‌రోనా కేసులు త‌క్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో ఏప్రిల్ 20 నుంచి వ్య‌వ‌సాయం, దాని అనుబంధ రంగాలు, ఐటీ, చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, నిర్మాణ రంగాల ప‌నులు చేసుకునేందుకు కొన్ని ఆంక్ష‌ల‌ను స‌డ‌లించింది. బ‌స్సులు, రైళ్లు, విమానాలు మాత్రం మే 3 వ‌ర‌కు తిర‌గ‌డానికి లేద‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే దేశ‌మంతా లిక్క‌ర్ షాపులు క్లోజ్ చేయాల్సిందేన‌ని ఆదేశించింది. మ‌ద్యంతో పాటు అన్ని ర‌కాల పొగాకు ఉత్ప‌త్తుల అమ్మ‌కంపై క‌ఠినంగా నిషేధం అమ‌లు చేయాల‌ని సూచించింది. ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను క‌చ్చితంగా అమ‌ల‌య్యేలా చూసుకునే బాధ్య‌త‌ను జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు అప్ప‌గించింది. ఎక్క‌డైనా ఉల్లంఘ‌న‌లు జ‌రిగిన‌ట్లు గుర్తిస్తే డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ యాక్ట్ – 2005 ప్ర‌కారం జ‌రిమానాలు, ఇత‌ర శిక్ష‌లు విధించే అధికారం ఇచ్చింది.

లిక్క‌ర్ సేల్స్ స్టార్ట్ చేసిన కొన్ని రాష్ట్రాలు..

దాదాపుగా దేశ‌మంతా మార్చి 22 నుంచి లిక్క‌ర్ షాపులు మూత‌ప‌డ్డాయి. క‌రోనా క‌ట్ట‌డి జ‌న‌తా క‌ర్ఫ్యూ అమ‌లు ఆ రోజు నుంచే కొన్ని రాష్ట్రాల లాక్ డౌన్ ప్ర‌క‌ట‌న‌, రెండ్రోజుల త‌ర్వాత‌ ప్ర‌ధాని దేశ వ్యాప్త లాక్ డౌన్ విధించ‌డంతో మ‌ద్యం దుకాణాలు కూడా బంద్ అయ్యాయి. అయితే ఏళ్లుగా బానిస‌లైన వారికి ఒక్క‌సారిగా లిక్క‌ర్ అంద‌కుండా ఆగిపోవ‌డంతో కొంత మందికి శారీర‌క‌, మాన‌సిక‌ అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. దీంతో అస్సాం, మేఘాల‌య స‌హా కొన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు కొద్ది స‌మ‌యం పాటు లిక్క‌ర్ షాపులు తెర‌వాల‌ని నిర్ణ‌యించాయి. లాక్ డౌన్ కార‌ణంగా అన్ని ర‌కాల లావాదేవీలు ఆగిపోవ‌డంతో ప్ర‌భుత్వాల‌కు ఆదాయం ప‌డిపోవ‌డం కూడా మ‌ద్యం షాపులు ఓపెన్ చేయ‌డానికి ఒక కార‌ణం. అయితే ఇప్పుడు కేంద్రం జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాలు అటు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో పాటు మందుబాబుల‌ను కూడా షాక్ కు గురిచేస్తున్నాయి.