
- ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా సూచన
న్యూఢిల్లీ: ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నిర్దేశిత ఫార్మాట్ ను అనుసరించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. రాజ్యాంగ గౌరవాన్ని తగ్గించే విధంగా పదాలను జోడించవద్దని తెలిపారు.18వ లోక్ సభలో ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కొంత మంది సభ్యులు ‘జై సంవిధాన్’, ‘జై హిందూ రాష్ట్ర’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్ నిర్దేశించిన ఫార్మాట్ ప్రకారం సభ్యులందరు ప్రమాణం చేయాలని కోరారు. కానీ, ఆయన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు.
ఈ నేపథ్యంలో సోమవారం లోక్ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ అంశంపై చర్చకు పలు పార్టీల ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘రాజ్యాంగంలోని షెడ్యూల్–3లో పేర్కొన్న ఫార్మాట్ ప్రకారం సభ్యులందరు ప్రమాణ స్వీకారం చేయాలని ఈ సభ తీర్మానిస్తుంది. సభ్యులందరు ఫార్మాట్ ప్రకారం ప్రమాణం చేస్తారని భవిష్యత్లో ఇటువంటివి పునరావృత్తం చేయరని సభ ఆశిస్తుంది” అని చెప్పారు. ఈ అంశం సభతో పాటు అందరికి ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.