హైదరాబాద్ సిటీ, వెలుగు: మ్యాట్రిమోనీ పేరుతో రూ.1.46 కోట్ల మోసానికి పాల్పడిన నలుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోసం చేసి దోచుకున్న డబ్బును నిందితులు హవాలా నెట్‌వర్క్ ద్వారా సింగపూర్‌కు చెందిన సైబర్ నేరగాళ్లకు చేరవేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు వెల్లడించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 13న సైబర్ క్రైమ్ పోలీసులకు ఓ బాధితుడి నుంచి ఫిర్యాదు వచ్చింది. సంగం మ్యాట్రిమోనీ ప్లాట్‌ఫామ్‌లో నిందితులు మహిళగా నటిస్తూ బాధితుడితో పరిచయం పెంచుకున్నారు. పెళ్లి చేసుకుంటామని నమ్మించారు. ఆపై లాభాలు వస్తాయంటూ నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడి పెట్టేలా చేశారు.
స్క్రీన్‌పై నకిలీ లాభాలను చూపిస్తూ బాధితుడి నుంచి విడతలవారీగా వివిధ బ్యాంక్ ఖాతాల్లోకి రూ.46.65 లక్షలు బదిలీ చేయించుకున్నారు. తర్వాత బాధితుడు తన డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా, అడిషనల్ ఫీజులు కట్టాల్సి ఉంటుందని విత్‌డ్రాలను నిలిపివేశారు. అనుమానంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేపట్టారు.
మ్యాట్రిమోనీ ప్లాట్‌ఫామ్‌తో మోసం చేస్తున్న సిద్దిపేటకు చెందిన చొక్కాల సంపత్, సికింద్రాబాద్‌కు చెందిన హెచ్చు నరేశ్, ఎండ్ల సురేశ్, వడ్కల మహేశ్ మోసానికి పాల్పడినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి ఆదేశాల మేరకు సంపత్ పని చేసేవాడని, ఇతడు 30 శాతం కమిషన్ తీసుకునేవాడని పోలీసులు తెలిపారు. నరేశ్ మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయించి డబ్బులు విత్‌డ్రా చేయించేవాడు. దీనికి 15 శాతం కమిషన్ పొందేవాడు.
