- ఫస్ట్ ఫేజ్‌లో అందుబాటులోకి సీపీగెట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పీజీ అడ్మిషన్లలో మరో నాలుగు కొత్త కోర్సులు రానున్నాయి. ఈ ఏడాది సీపీగెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లోనే నాలుగు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఎంఏ కోర్సులో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెల్త్ కేర్ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ గవర్నెన్స్, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, ఏవియేషన్ గవర్నెన్స్ వంటి ప్రొఫెషనల్ గ్రూపులను అందుబాటులోకి తెచ్చింది. మొత్తం 8 కొత్త కోర్సులకు విద్యామండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ప్రస్తుతానికి ఈ నాలుగింటిని ప్రాధాన్యత క్రమంలో అందుబాటులోకి తెచ్చారు.
ఈ కోర్సుల నిర్వహణపై టీజీసీహెచ్ఈ ఇప్పటికే ఆయా యూనివర్సిటీలకు లేఖలు రాసింది. సంబంధిత వర్సిటీలు తమ బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశాల్లో వీటికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మారుతున్న మార్కెట్ అవసరాలు, ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సంప్రదాయ కోర్సుల కంటే స్కిల్ ఆధారిత కోర్సులపై విద్యార్థులు ఆసక్తి చూపుతుండటంతో, వచ్చే విడతల్లో మిగిలిన నాలుగు కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
