నారాయణగూడ, వెలుగు: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నారాయణగూడలోని జీవీఆర్ కరాటే అకాడమీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కరాటే మాస్టర్ డాక్టర్ జి.ఎస్.గోపాల్ రెడ్డి ప్రపంచ రికార్డు సాధించారు. శుక్రవారం వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేవలం 36 సెకన్లలో ఆరుగురు విద్యార్థుల తలలపై ఉంచిన 26 సేపులను చేతితో విరగ్గొట్టి సాహసోపేత ప్రదర్శన చేశారు.
ఈ ప్రదర్శనతో ఆయన ప్రపంచ రికార్డు నెలకొల్పగా, కరాటే విద్యార్థులు తమ వేగం, కచ్చితత్వం, ఏకాగ్రత, ధైర్యం, నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలు, కరాటే, మార్షల్ ఆర్ట్స్ పై దృష్టి సారించాలని సూచించారు.
కార్యక్రమానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ పరిశీలకుడిగా హాజరై, ప్రపంచ రికార్డు సాధించిన డాక్టర్ గోపాల్ రెడ్డి, పాల్గొన్న విద్యార్థులకు రికార్డు ధ్రువపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.
