సీఎం అడ్వైజర్‌‌‌‌‌‌‌‌గా రామకృష్ణారావుకు ఎక్స్అఫిషియో స్పెషల్ సీఎస్ హోదాతో పదవి

సీఎం అడ్వైజర్‌‌‌‌‌‌‌‌గా రామకృష్ణారావుకు  ఎక్స్అఫిషియో స్పెషల్ సీఎస్ హోదాతో పదవి
  • ఈనెల 30న రిటైర్మెంట్​ తర్వాత అమల్లోకి..

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్​ రెడ్డి సలహాదారుడిగా ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30న సీఎస్ గా రామకృష్ణారావు రిటైర్మెంట్ అయిన తక్షణం ఎక్స్ అఫిషియోగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో సీఎం అడ్వైజర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తారని ప్రభుత్వం పేర్కొంది. 

రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన.. గత 14 నెలలుగా సీఎస్​గా కొనసాగుతున్నారు.  వాస్తవానికి గతేడాది ఏప్రిల్​తోనే ఆయన రిటైర్​ కావాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 3 నెలలు ఒకసారి, 7 నెలలు మరోసారి  కేంద్రం సీఎస్ గా ఆయనకు పొడగింపు ఇచ్చింది. ఇప్పుడు పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో ఆయనకున్న సుదీర్ఘ అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు  సీఎంకు సలహాదారుడిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

కీలక బాధ్యతల్లో ప్రత్యేక చొరవ

ఈ ఆఫీస్​, 99 రోజుల ప్రణాళిక, క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ల విజిట్, ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా, క్యాష్​లెస్​హెల్త్​ కార్డుల అంశంలో రామకృష్ణారావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. 1991 ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ బ్యాచ్‌‌‌‌‌‌‌‌కు చెందిన రామకృష్ణారావు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి  అత్యంత కీలక బాధ్యతల్లోనే కొనసాగారు.  స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని నంద్యాల. తండ్రి రైల్వే ఉద్యోగి కాగా, చిన్నతనంలో ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా కాజీపేటలో పెరిగారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో నల్గొండ, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లో సబ్‌‌‌‌‌‌‌‌కలెక్టర్, జాయింట్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా, గుంటూరు, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాల కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా, విద్యాశాఖ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా, ప్రణాళికాశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీ విభజన ప్రక్రియలో ఆయన చురుగ్గా పనిచేశారు. పుష్కరకాలంగా ఆర్థికశాఖ లో పనిచేసిన ఆయన మొత్తం 14 రాష్ట్ర బడ్జెట్లను రూపుదిద్దారు. వీటిలో 12 పూర్తిస్థాయి కాగా, మరో రెండు ఓటాన్‌‌‌‌‌‌‌‌ ఎకౌంట్‌‌‌‌‌‌‌‌ బడ్జెట్లు. తొలుత 2014 నవంబరు 5న పూర్తి స్థాయి బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను ప్రవేశపెట్టడం విశేషం.