సూర్యుడు చీకట్లను తొలగించి.. సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్య భగవానుడు. ఉదయం బ్రహ్మ దేవుడిగా.. మధ్యాహ్నం మహేశ్వరుడిగా.. సాయంకాలం విష్ణువుగా.. తెల్లటి ఏడు గుర్రాల రథంపై శ్వేతపద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యుడు.
అదితి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని (2026 జనవరి 25) సూర్యుడు అవతరించాడని పండితులు చెబుతున్నారు. హిందువులు ఆరోజున సూర్యుడిని ఆరాధిస్తుంటారు. ఆ రోజున ఆకాశం మొత్తం రథాకారంలో కనిపిస్తుందని పండితులు చెబుతున్నారు.
సూర్యుడు తన రథం దిశను మార్చుకునే రోజు.. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి రోజు. సూర్యుడు అనంతమైన కాలానికి అధిపతి. విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు. సూర్యుడిని భాస్కరుడు అని కూడా అంటారు. భాసం... అంటే ప్రకాశం. కరుడు.. అంటే చేసేవాడు . భాస్కరుడు.. అంటే జగత్తును ప్రకాశవంతం చేసేవాడు అని అర్థం.
సూర్యభగవానుని ప్రేరణతోనే సమస్త జీవరాశులు పగటివేళ వాటి విధుల్లోనూ , రాత్రివేళలో నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటాయి. పురాణాల ప్రకారం సూర్య భగవానుడికి శక్తి కేంద్రంగా భావిస్తారు. పాఠ్యపుస్తకాలలో సూర్యశక్తి గురించి కూడా సైంటిఫిక్ గా వివరించారు. ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యునికి ఎంతో శక్తిఉందని.. నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు అనేక వ్యాధులను దూరం చేసుకొనేవాడిగా.. వృద్దాప్యంలోనూ.. ఆరోగ్యానికి ప్రసాదించే వానిగా భావిస్తారు.
సూర్యుడిని ఆరోగ్యప్రదాతగా కొలుస్తుంటారు. రథసప్తమి రోజున ప్రాతఃకాల సమయాన గంగలో స్నానాలు, సూర్యోపాసనల వలన మృత్యుభయం పోతుందని నమ్ముతుంటారు. మరణించిన తర్వాత సూర్యలోకానికి వెళతారని పండితులు అంటుంటారు. ఆ రోజున నదీ తీరాలలో నెయ్యి లేదా నూనెతో ప్రమిదలో దీపాన్ని వెలిగించి.. నీటిలో వదలాలి. ఆ తర్వాత మగవాళ్లు తలమీద 7 జిల్లేడు ఆకులను, ఆడవారు 7 చిక్కుడు ఆకులను ఉంచుకుని స్నానం చేసి నీళ్ళలో నవధాన్యాలు , ధాన్యం, నువ్వులు, అక్షింతలు, చందనం కలిపుకొని స్నానం చేయాలి.
రథ సప్తమిరోజున ఆవు నేతితో దీపారాధన చెయడం వల ఆ ఇంటిలో అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు చెపుతారు. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి, దానిపై పిండితో పద్మం వేసి, పొయ్యి పెట్టి, సంకాంత్రి రోజున పెట్టిన పిడకలు, గొబ్బెమ్మలతో పోయ్యి వెలిగించి దాని మీద పాలు పొంగిస్తారు. తరువాత ఆ పాలల్లో కొత్తబియ్యం, బెల్లం, నెయ్యి, ఏలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు. తులసికోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది.
రథ సప్తమి రోజు ఉపవాసము ఉండి దైవారాథనలోనే కాలం గడిపితే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుని అనుగ్రహం పొందుతారని పురాణాలు తెలిపాయి. ఈ రోజున ముత్తయిదువులు తమ నోములకు, వ్రతాలకు అంకురార్పణ చేస్తారు. ఇందులో చిత్రగుప్తుని నోము, ఉదయకుంకుమ నోము , పదహారఫలాల నోము, గ్రామకుంకుమ నోములను రథ సప్తమి రోజున ప్రారంభిస్తారు. ఈ రోజు పుణ్యకార్యములు తలపెట్టిన విజయవంతగా పూర్తి అవుతాయని పండితులు చెబుతున్నారు.
