యాదాద్రి, వెలుగు: మొక్కజొన్న బస్తాలను అన్‌లోడ్ చేయకపోవడంతో లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. శుక్రవారం యాదాద్రి జిల్లాలోని వలిగొండ–చిట్యాల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లాలో కొనుగోలు చేసిన మొక్కజొన్నలను సుమారు 200 లారీల్లో లోడ్ చేసి యాదాద్రి జిల్లాకు తరలించారు. వీటిని వలిగొండ మండలంలోని అద్దె గోదాముకు తీసుకొచ్చినా అన్‌లోడ్ చేయడం లేదని డ్రైవర్లు తెలిపారు.
ఆరు రోజులు గడిచినా బస్తాలను దింపుకోకపోవడంతో లారీ డ్రైవర్లు ఆగ్రహానికి గురై ఆందోళన చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని డ్రైవర్లతో చర్చించారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో డ్రైవర్లు ఆందోళన విరమించారు.
