బరువు తగ్గించే మెడిసిన్‌‌‌‌తో మెదడుపై ఎఫెక్ట్..తాజా అధ్యయనంలో వెల్లడి

బరువు తగ్గించే మెడిసిన్‌‌‌‌తో మెదడుపై ఎఫెక్ట్..తాజా అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: బరువు తగ్గడానికి వాడే కొత్త మెడిసిన్​తో ఆకలిని తగ్గించడమే కాకుండా, మెదడులోని రివార్డ్ సర్క్యూట్ పై నేరుగా ప్రభావం చూపుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. దీనివల్ల మనిషికి కలిగే సంతోషం లేదా ఆనందం పొందే విధానం కూడా మారే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా జీఎల్పీ1 మందులు మెదడులోని వెనక భాగంపై పనిచేసి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అయితే, అమెరికాలోని వర్జీనియా వర్సిటీ పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో.. డానుగ్లిప్రాన్, ఓర్ఫోగ్లిప్రాన్ వంటి కొత్త తరం మందులు మెదడులోని లోతైన భాగాలకు చేరుకుంటున్నట్లు గుర్తించారు. 

ఈ మందులు కేవలం కడుపు నిండింది అని చెప్పడమే కాకుండా, కేక్ లేదా ఇతర రుచికరమైన పదార్థాలను తినాలి అనే కోరికను తగ్గిస్తాయని న్యూరో సైంటిస్ట్​అలీ డి గులెర్ తెలిపారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం.. కొంతమంది రోగులలో ధూమపానం వంటి అలవాట్లను మానుకోవడం సులభం కావొచ్చని తెలుస్తోంది. అలాగే, బింజ్ఈటింగ్(అతిగా తినడం) వంటి సమస్యలకు ఇది పరిష్కారం చూపొచ్చు. మరికొందరు రోగులు తమకు ఇష్టమైన పనుల్లో మునుపటిలా ఆనందాన్ని పొందలేకపోవచ్చని తేలింది. నోటి మాత్రలు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ పరిశోధన వివరాలు అంతర్జాతీయ సైన్స్ జర్నల్ నేచర్‌‌లో ప్రచురితమయ్యాయి.