మీ పాత PF అకౌంట్ వివరాలు మర్చిపోయారా.. ఇ-ప్రాప్తి పోర్టల్‌తో ఈజీగా చెక్ చేసుకోవచ్చు!

మీ పాత PF అకౌంట్ వివరాలు మర్చిపోయారా.. ఇ-ప్రాప్తి పోర్టల్‌తో  ఈజీగా చెక్ చేసుకోవచ్చు!

చాలామంది ఉద్యోగాలు మారినప్పుడు పాత పీఎఫ్ అకౌంట్ గురించి పట్టించుకోరు లేదా మర్చిపోతుంటారు. అలా ఉండిపోయిన పాత పీఎఫ్ అకౌంట్స్ గుర్తించి, ఆ డబ్బును తిరిగి పొందేలా చేయడానికి కేంద్ర ప్రభుత్వం 'ఇ-ప్రాప్తి' (e-PRAPTI) అనే కొత్త వెబ్‌సైట్‌ను తీసుకువస్తోంది. దీని గురించి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా కీలక విషయాలు వెల్లడించారు.

ఇ-ప్రాప్తి పోర్టల్ ఏంటి 
దీని పూర్తి పేరు 'ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆధార్-బేస్డ్ యాక్సెస్ పోర్టల్ ఫర్ ట్రాకింగ్ ఇనాపరేటివ్ అకౌంట్స్'. అంటే, ఆధార్ కార్డు ఆధారంగా మీ పాత లేదా నిలిచిపోయిన  పీఎఫ్ అకౌంట్ వెతికి పట్టుకోవడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది.

దీని వల్ల ఉపయోగాలు:
* మీ UAN నంబర్‌తో లింక్ అవ్వని పాత పీఎఫ్ అకౌంట్స్ ఈజీగా కనిపెట్టవచ్చు.
*ఒకవేళ పాత పీఎఫ్ నంబర్లు గుర్తులేకపోయినా, ఆధార్ వివరాలతో వాటిని యాక్సెస్ చేసే వెసులుబాటు త్వరలో వస్తుంది.
* కంపెనీల మీద లేదా పీఎఫ్ ఆఫీసుల మీద ఆధారపడకుండా మీరే మీ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు ఇంకా ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు. 

పీఎఫ్ సెటిల్‌మెంట్‌లో కొత్త రికార్డు
గతంతో పోలిస్తే ఇప్పుడు పీఎఫ్ క్లెయిమ్ చేయడం చాలా వేగంగా జరుగుతోందని ప్రభుత్వం తెలిపింది.  2025–26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 8.31 కోట్ల క్లెయిమ్‌లను సెటిల్ చేసారు. 71% అడ్వాన్స్ పీఎఫ్ అభ్యర్థనలు కేవలం 3 రోజుల్లోనే ఆటోమేటిక్‌గా ప్రాసెసింగ్ అవుతున్నాయి. దాదాపు 1.59 కోట్ల మంది పిఎఫ్ సబ్స్క్రయిబర్లు కంపెనీ యజమానితో సంబంధం లేకుండా బ్యాంక్ వివరాలను సొంతంగా అప్‌డేట్ చేసుకున్నారు. పేపర్ పని లేకుండా 6 కోట్లకు పైగా పిఎఫ్ చందాదారులు  ఎటువంటి చెక్కు కాపీలు అప్‌లోడ్ చేయకుండానే క్లెయిమ్‌లు పూర్తి చేశారు.

కొత్తగా రాబోతున్న ఈ 'ఇ-ప్రాప్తి' సిస్టమ్ వల్ల పేపర్ పని తగ్గుతుంది. పాత పీఎఫ్ డబ్బులు నిలిచిపోయిన వారికి, యూఏఎన్ (UAN) సమస్యలు ఉన్నవారికి ఇది ఒక గొప్ప వరం అని చెప్పవచ్చు. దీనివల్ల పీఎఫ్ లావాదేవీలు మరింత పారదర్శకంగా, వేగంగా మారనున్నాయి.