ఓటీపీ చెబితేనే వంట గ్యాస్ హోం డెలివరీ: నవంబర్ 1 నుంచి కొత్త సిస్టమ్

ఓటీపీ చెబితేనే వంట గ్యాస్ హోం డెలివరీ: నవంబర్ 1 నుంచి కొత్త సిస్టమ్

వంట గ్యాస్ హోం డెలివరీ సిస్టమ్‌లో నవంబర్ 1 నుంచి కొత్త మార్పులు రాబోతున్నాయి. గ్యాస్ డెలివరీ సమయంలో ఓటీపీ తరహా వ్యవస్థను అమలు చేసేందుకు ఆయిల్ కంపెనీలు సిద్ధమయ్యాయి. ఫోన్‌ ద్వారా బుక్ చేస్తే ఇంటికి వచ్చేస్తున్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ డెలివరీ టైమ్‌లో తామే బుక్ చేశామంటూ దొంగలు తీసుకెళ్లిపోయే చాన్స్ ఉండడంతో దీనికి చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయిల్ కంపెనీలు తెలిపాయి. ఇందులో భాగంగా గ్యాస్ డెలివరీ సమయంలో ఓటీపీ చెబితేనే దానిని ఓనర్‌కి అప్పగించేలా మార్పులు తెస్తున్నట్లు వెల్లడించాయి.

డెలివరీ అథెంటికేషన్ కోడ్

వంట గ్యాస్ కోసం రిజర్డ్ ఫోన్ నంబర్ నుంచి బుక్ చేసిన సమయంలో డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీ) మెసేజ్ వస్తుంది. ఇంటికి గ్యాస్ డెలివరీ బాయ్ వచ్చినప్పుడు ఆ కోడ్‌ను చెబితే సిలిండర్‌ను అప్పగిస్తాడు. సిలిండర్లు పక్కదారి పట్టకుండా సరైన కస్టమర్‌కి చేర్చేందుకు ఈ మార్పులు చేస్తున్నారు. ఈ డీఏసీ వ్యవస్థను పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే రాజస్థాన్‌లోని జైపూర్‌లో అమలవుతోంది. నవంబర్ 1 నుంచి మరిన్ని ప్రాంతాలకు విస్తరించబోతున్నారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీల్లో ఈ కొత్త సిస్టమ్ అమలులోకి రాబోతోంది. తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, ఏపీలోని విశాఖ, తిరుపతి, కాకినాడ సిటీలు స్మార్ట్ సిటీల కింద ఎంపికై ఉన్నాయి. కాగా, కమర్షియల్ సిలిండర్లకు ఈ ఓటీపీ సిస్టమ్ అమలు చేయడంలేదు.